- హైదరాబాద్ లో పెరుగుతున్న ఇంటి రేంజ్
- గ్రేటర్ సిటీ శివారులో 60 లక్షల పైనే ఇంటి ధరలు
- ఐదేళ్లలో 25 శాతం తగ్గిన అఫర్డబుల్ హౌజింగ్
- అనుకున్న వెంటనే ఇల్లు కొనాలంటున్న నిపుణులు
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఆ కలను నెరవేర్చుకోవడం మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే హైదరాబాద్ తో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో హౌజ్ కాస్ట్ రేంజ్ పెరిగిపోతోంది. ఒకప్పుడు 30 లక్షల్లో కూడా ఇల్లు దొరికే భాగ్యనగరం శివారు ప్రాంతాల్లో ఇప్పుడు కనీసం 60 లక్షలు పెట్టాల్సిందే. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఇంటి ధరల రేంజ్ మరింత పైకి వెళ్లనుందంటున్న రియాల్టీ నిపుణులు.. గృహ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేయకుండా అనుకున్న వెంటనే డిసైడ్ కావాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ లో అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణం రోజు రోజుకు తగ్గుతోంది. అఫర్డబుల్ హౌజింగ్ నిర్మాణానికి గ్రేటర్ బిల్డర్లు ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 30 లక్షల నుంచి కూడా గృహాలు లభించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రధానంగా భాగ్యనగరంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
దీంతో ఆ ప్రభావం ఇంటి ధరపై పడుతోంది. అంతే కాకుండా ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్టీల్, సిమెంట్ తదితరాల ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం సైతం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణంలో లాభాల మార్జిన్లు తగ్గిపోవడం, తక్కువ వడ్డీ రేటుతో అవసరమైనంతగా బ్యాంక్ లోన్స్ లేకపోవడం తదితర అంశాలు అఫర్డబుల్ ఇళ్ల సరఫరా పడిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
2018 నుంచి గత సంవత్సరం 2023 వరకు ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణం 15 శాతానికి పడిపోయింది. 2018లో ఏడు మెట్రో నగరాల్లో మొత్తం 1,95,300 గృహాల నిర్మాణం ప్రారంభం అవ్వగా అందులో 40 శాతం ఇళ్లు అఫర్డబుల్ కేటగిరీలో ఉన్నాయి. ఇది 2020లో 30 శాతానికి, 2021లో 26 శాతానికి, 2022లో 20 శాతానికి తగ్గిపోయింది. ఇక గత యేడాది 2023లో అఫర్డబుల్ కేటగిరి హౌజింగ్ నిర్మాణం 15 శాతానికి పడిపోయిందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
దీంతో క్రమంగా అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణం తగ్గిపోవడంతో గృహ ధరల రేంజ్ పెరిగిపోతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఐదేళ్ల క్రితం 30 లక్షల్లో సైతం ఇల్లు దొరికేవి. కాని ఇప్పుడు కనీసం 60 లక్షల రూపాయలుంటేనే అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ వస్తోంది. అది కూడా నగర శివారు ప్రాంతాల్లో మాత్రమే. అదే హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతాల్లో ఐతే కనీసం కోటి రూపాయలు లేనిదే అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ రావడం లేదు.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 60 లక్షలుగా ఉన్న హౌజ్ కాస్ట్ రేంజ్ రానున్న రోజుల్లో మరింత పెరిగిపోయి 75 నుంచి 90 లక్షల కనీసం ధరలకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఇంది ధరల రేంజ్ పెరుగుతున్న నేపధ్యంలో ఇంటి కోనుగోలు నిర్ణయం తీసుకున్నాక ఆలస్యం చేయకూడదని సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 80 లక్షల నుంచి 1.5 కోట్ల రేంజ్ లోని ఇళ్లకు భారీ డిమాండ్ ఉంటోంది.
అందుకు అనుగునంగానే బిల్డర్లు నివాస గృహాల నిర్మాణాలు చేపడుతున్నారు. రవాణా సౌకర్యాలు, మౌళిక వసతులు పెరగడంతో నగర శివారు ప్రాంతాల్లో సైతం ఇళ్ల కొనుగోలుకు ఆసక్తిచూపుతున్నారు. ఐతే అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సైతం సహకరిస్తే ఈ కేటగిరిలోని గృహ నిర్మాణాలు పెరుగుతాయని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో 60 లక్షల రేంజ్ లో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్ లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. హయత్ నగర్, షామీర్ పేట్, ఘట్ కేసర్, మేడ్చల్, తారామతిపేట, శంషాబాద్, గండిమైసమ్మ తదితర ప్రాంతాల్లో 60 నుంచి 70 లక్షల రేంజ్ లో ఇళ్లు అందుబాటులో ఉన్నాయి.
రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల్లోను ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇంటికొనుగోలు విషయంలోనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎవరి బడ్జెట్ కు అనుగునంగా వారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.