తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్దమవుతోంది. గతంలో ఆల్‌టైం రికార్డు ధర పలికిన కోకాపేటలో మిగిలిన ప్రభుత్వ భూములను అమ్మేందుకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ కసరత్తు చేస్తోంది. కోకాపేట నియోపొలిస్ లేఅవుట్ విస్తీర్ణం 531.46 ఎకరాలు కాగా.. ఇందులో ఇప్పటికే 380 ఎకరాలను వేలంలో విక్రయించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మరికొన్ని భూములను పలు సంస్థలకు కేటాయించారు.
నియోపొలిస్ లో సుమారు రూ.450 కోట్లతో హెచ్‌ఎండీఏ మౌలిక వసతులను అభివృద్ది తేసింది హెచ్ఎండీఏ. ప్రస్తుతం ఈ పనులన్నీ దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కోకాపేటలో మరో 24 ఎకరాల భూములను వేలానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ స్థలాలను దక్కించుకున్న రాజపుష్ప, హ్యపీహైట్స్, మైహోమ్ తదితర నిర్మాణ సంస్థలు చేపట్టిన నిర్మాణాలు పూర్తి కానున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా.. ఇప్పటివరకు హెచ్‌ఎండీఏ ప్లాట్లు, భూములను విక్రయించలేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భూముల అమ్మకాలపై ఆచితూచి వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్. ఇప్పుడిప్పుడే రియాల్టీ మార్కెట్ కోలుకుంటున్న నేపధ్యంలో మరోసారి కోకాపేట నియోపొలిస్ లేఅవుట్లలో మిగిలిన భూముల వేలానికి హెచ్‌ఎండీఏ రేడీ అవుతోంది.
కోకాపేటతో పాటు బహదూర్‌పల్లి లేఅవుట్‌లో గతంలో వేలం ద్వారా విక్రయించగా, ఇంకా 69 ప్లాట్లు మిగిలాయి. తొర్రూరులో 504 ప్లాట్లకు గాను 114 మిగిలిపోయాయి. కుర్మగూడ, తుర్కయాంజల్ లేఅవుట్లలో సైతం 40 నుంచి 50 వరకు ప్లాట్లు మిగిలిపోయాయి. ప్రస్తుతం ఆయా లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీ ఇతర మౌలిక వసతులను హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తోంది. ఆ తరువాత ఇక్కడ కూడా మిగిలిపోయిన ప్లాట్లను వేలం వేసే దిశగా అడుగులు వేస్తోంది.
గత సంవత్సరం ఆగస్టులో కోకాపేటలోని నియోపొలిస్‌లో 45.33 ఎకరాలను వేలం వేయగా.. హైదరాబాద్ చరిత్రలోనే రికార్డు ధర పలికింది. వేలంలో ఎకరా రూ.100.75 కోట్లకు హెచ్‌ఎండీఏ విక్రయించింది. 3.6 ఎకరాల ఉన్న ఈ ప్లాటు ఏకంగా రూ.362.70 కోట్లు ధర పలకడం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. మొత్తం 45.33 ఎకరాల భూమిని వేలం వేయగా.. తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,319.60 కోట్ల ఆదాయం వచ్చింది. కోకాపేట్ లో ఎకరా సరాసరి రూ.73.25 కోట్లకు అమ్ముడుపోయింది.
ఈ 45.33 ఎకరాల అప్‌సెట్ ధరే రూ.1586.55 కోట్లు.. అంతకు రెండు రెట్లు ఆదాయం సమకూరింది. అప్పట్లో కనీస బిడ్ పెంపు ఎకరాకు ఏకంగా రూ.25 లక్షలు నిర్ణయించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నియోపొలిస్ లేఅవుట్‌లో 50పైనే అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడు మరోసారి కోకాపేటలో భూముల వేలం వేయనుండగా.. ఎకరం ఎంత ధరకు అమ్ముడుపోతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.