స్కై స్క్రేపర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న భాగ్యనగర నిర్మాణ రంగం కొత్త పోకడలకు నాంది పలుకుతోంది. నేలపై ఉండాల్సిన సౌకర్యాల్ని.. భూమికి ఆకాశానికి మధ్యలో ఏర్పాటు చేస్తున్నాయి. స్విమ్మింగ్ ఫూల్ నుంచి మొదలు గార్డెన్, జాగింగ్ ట్రాక్ వరకు.. టెర్రస్ పైన ఏర్పాటు చేస్తున్నాయి.
నిర్మాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎత్తైన నిర్మాణాల డిజైన్లు, ఫీచర్స్ లో ఆధునిక సాంకేతికతను నిర్మాణ సంస్థలు ఉపయోగిస్తున్నాయి. వెస్ట్ హైదరాబాద్ లో నివాస, వాణిజ్య భవనాలన్నీ కనీసం 45 అంతస్తుల పైనే నిర్మాణం జరుపుకుంటున్నాయి. గతంలో మూస పద్దతిలో భవన నిర్మాణాలుండగా.. ఇప్పుడు అందమైన డిజైన్స్ పై దృష్టి పెట్టాయి. అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్లను నియమించి అత్యాధునిక పద్దతుల్లో ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నాయి.
స్కై స్క్రేపర్లలో నిన్నటి వరకు నేలపైనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేవారు. స్విమ్మింగ్ ఫూల్ నుంచి మొదలు క్లబ్ హౌజ్ వరకు అన్నింటిని నిర్మించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. స్కై స్క్రాపర్స్ లో ఎమినిటీస్ అన్నీ.. నేలకు, ఆకాశానికి మధ్య ఏర్పాటు చేస్తున్నాయి. స్విమ్మింగ్ ఫూల్, గార్డెన్, జాగింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, రిక్రియేషన్ ఏరియా, టెన్నిస్ కోర్ట్, యోగా డెక్, కాఫీ క్లబ్, చిల్డ్రన్ ప్లే ఏరియా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. అన్ని సౌకర్యాలను ఎంజాయ్ చేస్తూ ఏకంగా ఆకాశంలో ఉన్న ఫీలింగ్ కలిగేలా నిర్మాణాలను చేపడుతున్నాయి. 32 నుంచి 58 అంతస్తులపై ఇలా అన్ని ఎమినిటీస్ ని కల్పిస్తూ.. కొనుగోలుదారులకు సరికొత్త అనుభూతుల్ని పంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
హైదరాబాద్లో ప్రస్తుతం సుమారు పది వరకు నిర్మాణ సంస్థలు ఇలాంటి సరికొత్త డిజైన్లతో భారీ నివాస, వాణిజ్య భవనాల నిర్మాణం చేపట్టాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఒకరితో మరొకరు పోటీ పడుతూ.. ఒక్కో నిర్మాణంలో ఒక్కో ఫీచర్ ను జోడిస్తూ మిగతా భవనాలకు భిన్నంగా ఉండాలని తపన పడుతున్నాయి.