poulomi avante poulomi avante

ప్రీ లాంచ్ సంస్థ‌ల‌పై చ‌ర్య‌లేవీ?

  • సొమ్ము తీసుకుని ఫ్లాట్లు క‌ట్ట‌క‌పోతే?
  • రెరాలో న‌మోదైన‌వి.. అమ్మ‌కానికి.. 2 ల‌క్ష‌ల ఫ్లాట్లు
  • యూడీఎస్‌, ప్రీలాంచ్‌లో అమ్మే ఫ్లాట్లు.. 1 ల‌క్ష‌
  • ఏడాదికి అమ్ముడ‌య్యేది 20 వేలే..
  • అక్ర‌మ ఫ్లాట్ల వ‌ల్ల రెరా ప్రాజెక్టుల‌కు తిప్ప‌లు

త‌క్కువ రేటంటే సెల్ ఫోన్ కొనొచ్చు.. డిస్కౌంటు ఇస్తే బ‌ట్ట‌లు కొనొచ్చు.. కానీ, ఫ్లాట్లు మాత్రం కొన‌కండి. అపార్టుమెంట్లు క‌ట్ట‌డ‌మంటే మాటలు కాదు. దానికెంత శ్ర‌మ‌ప‌డాల్సి ఉంటుంది. స‌రైన స్థ‌లాన్ని ఎంచుకోవ‌డం, ప‌క్కా ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించ‌డం, అనుమ‌తి తెచ్చుకోవ‌డం, పునాది నుంచి గృహ‌ప్ర‌వేశం వ‌ర‌కూ పూర్తి చేయాలంటే ఓ య‌జ్ఞంలా ప‌ని చేయాలి. ఇందుకోసం ఎంతో నిబ‌ద్ధ‌త‌తో, అహ‌ర్నిశ‌లు కృషి చేస్తూ.. వంద‌ల మంది ప‌ని చేస్తేనే సాధ్య‌మ‌వుతుంది. మ‌రి, యూడీఎస్ లేదా ప్రీ లాంచ్‌లో ఫ్లాట్లు అమ్మేవారికి ఇంత నిబద్ధ‌త ఉంటుందా? ఒక్క‌సారి ఆలోచించండి.

ఎలాంటి క‌ష్టం లేకుండా.. కేవ‌లం బ్రోచ‌ర్ల మీద ఫ్లాట్ల‌ను అమ్మేవారికి.. ప్రాజెక్టును పూర్తి చేయాల‌నే ల‌క్ష్యం ఎందుకు ఉంటుంది చెప్పండి. వారి ధ్యాస మొత్తం కేవ‌లం సొమ్మును స‌మీక‌రించుకుని.. ఇత‌ర ప్రాంతాల్లో భూముల్ని కొన‌డం మీదే ఉంటుంది త‌ప్ప‌.. బ‌య్య‌ర్ల‌కు ఫ్లాట్ల‌ను నిర్మించి ఇవ్వాల‌నే ఆలోచ‌న ఎలా ఉంటుంది? ఎవ‌రైనా అలా భ్ర‌మిస్తే.. అది త‌ప్పులో కాలేసిన‌ట్లే లెక్క‌. అస‌లు అనుమ‌తులు లేకుండా ఫ్లాట్ల‌ను అమ్మేవారిని ఎట్టి ప‌రిస్థితిలో న‌మ్మ‌కండి. వాళ్లు సొమ్ము తీసుకుని పారిపోతే ఎలా? దానికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు?

సొమ్ము దండుకోవ‌డ‌మే!

యూడీఎస్, ప్రీ లాంచుల్లో ఫ్లాట్లు అమ్మేవారి దృష్టి సొమ్ము దండుకోవ‌డం మీదే ఉంటుంది త‌ప్ప నిర్మాణాల్ని పూర్తి చేయ‌డం మీద ఎట్టి ప‌రిస్థితిలో ఉండ‌దు. ఎందుకు ఇంత కచ్చితంగా చెప్పొచ్చంటే.. నిర్మాణాల్ని నిబ‌ద్ధ‌తతో చేసేవారు యూడీఎస్‌, ప్రీ లాంచుల్లో విక్ర‌యించ‌నే విక్ర‌యించ‌రు. అనుమ‌తుల‌న్నీ స‌క్ర‌మంగా తీసుకుని.. ఒక ప‌ద్ధ‌తిలోనే ప్రాజెక్టుల్ని చేప‌డ‌తారు. అలా కాకుండా, అక్ర‌మ ప‌ద్ధ‌తిలో ఫ్లాట్ల‌ను అమ్ముతున్నారంటేనే సందేహించాలి. అందులో కొనేవారు క‌చ్చితంగా ఒక విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఆయా ప్రాజెక్టు పూర్త‌య్యే స‌మ‌స్యే లేదు. పెట్టుబ‌డి పెట్టిన‌వారు సొంతింట్లోకి అడుగు పెట్టేందుకు నానా క‌ష్టాలు ప‌డాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఢిల్లీలోని గుర్గావ్‌, నొయిడాలో కొంద‌రు ఇళ్ల కొనుగోలుదారుల ప‌రిస్థితిని చూస్తుంటే జాలేస్తుంది. ఇదిగో ఇలాగే త‌క్కువ రేటుకు వ‌స్తుందంటే కొన్నారు. ప‌దేళ్ల‌యినా సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోలేక‌పోయారు. ప్ర‌స్తుతం వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

2 ల‌క్ష‌ల ఫ్లాట్లు..

గ‌త మూడేళ్ల‌లో రెరా వ‌ద్ద అనుమ‌తులు తీసుకున్న ప్రాజెక్టుల్ని లెక్కిస్తే.. దాదాపు 2 ల‌క్ష‌ల ఫ్లాట్ల దాకా ఉంటాయి. ఇవి కాకుండా యూడీఎస్ లేదా ప్రీలాంచ్‌లో విక్ర‌యిస్తున్న ఇళ్లేమో ల‌క్ష వ‌ర‌కూ ఉండొచ్చ‌ని రియ‌ల్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇవి కాకుండా, చిన్నాచిత‌క బిల్డ‌ర్లు, మేస్త్రీలు హైద‌రాబాద్ శివార్లు, ఇత‌ర ముఖ్య ప‌ట్ట‌ణాల్లో క‌డుతున్న ఇళ్ల సంఖ్య ఎంత‌లేద‌న్నా యాభై వేల దాకా ఉంటాయి. ఒక్క హైద‌రాబాద్‌లోనే ఏడాదికి ఎంత‌లేద‌న్నా 20 వేల ఫ్లాట్లు అమ్ముడ‌వుతాయని అంచ‌నా. ఈ లెక్క‌న చూస్తే గ‌త మూడేళ్ల‌లో 60 వేల ఫ్లాట్లు అమ్ముడైనా.. ఇంకా ల‌క్షా న‌ల‌భై వేల ఫ్లాట్లు ఉంటాయి. సాధార‌ణంగా అయితే, వీటిని అమ్మ‌డానికి ఎంత‌లేద‌న్నా మ‌రో ఐదారేళ్ల‌యినా ప‌డుతుంది.

కాక‌పోతే, యూడీఎస్ మ‌రియు ప్రీ లాంచుల ప్రాజెక్టుల వ‌ల్ల సాధార‌ణ అమ్మ‌కాలు మార్కెట్లో గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయి. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా యూడీఎస్‌, ప్రీ లాంచుల్లోనే కొంద‌రు ఎక్కువ‌గా ఫ్లాట్ల‌ను కొంటున్నారు. కార‌ణం.. త‌క్కువ ధ‌ర‌కు రావ‌డ‌మే. కొండాపూర్‌లో సాధార‌ణంగా చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.8,000 నుంచి 9000కు ఫ్లాట్లు ల‌భిస్తే.. అక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో.. కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు వంద శాతం సొమ్ము క‌ట్టేవారికి చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.4000 నుంచి రూ.5000కు విక్ర‌యిస్తున్నారు. దీని వ‌ల్ల అంతిమంగా న‌ష్ట‌పోయేది హైద‌రాబాద్ నిర్మాణ రంగ‌మే. ఎలాగో తెలుసా?

రెరా ప్రాజెక్టులే ఉత్త‌మం

యూడీఎస్‌, ప్రీ లాంచుల్లో ఫ్లాట్ల‌ను అమ్మిన త‌ర్వాత‌.. ఆయా భూమికి సంబంధించి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులుంటే ఎలా? వాటిని ఎవ‌రు ప‌రిష్క‌రిస్తారు? ఆయా స‌మ‌స్యకు ప‌రిష్కారం ల‌భించేదెప్పుడు? ఇదిగో ఇలాగే, కొంద‌రు సుల్తాన్‌పూర్‌లో కొంద‌రు త‌క్కువ రేటంటూ భూమిని కొన్నారు. మూడేళ్ల‌యినా వెంచ‌ర్ ఆరంభం కాలేదు. అందులో న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్తాయి. మూడేళ్ల క్రితంతో పోల్చితే అక్క‌డ భూమి రేటు పెరిగింది. కానీ ఏం లాభం? అక్క‌డ ప్రాజెక్టే ఆరంభం కాలేదు. అందులో కొన్న‌వారు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. కాబ‌ట్టి, ప్రీ లాంచుల్లో ఎట్టి ప‌రిస్థితులో కొన‌కండి. రెరా అనుమ‌తి గ‌ల ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేస్తే.. బిల్డ‌ర్ నుంచి మీకెలాంటి స‌మ‌స్య వ‌చ్చినా.. ప్ర‌భుత్వం నుంచి పూర్తి స్థాయి మ‌ద్ధ‌తు ల‌భిస్తుంది. ఆయా డెవ‌ల‌ప‌ర్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా రెరా అథారిటీ ప‌రిష్క‌రిస్తుంద‌నే విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు.

ప్రీ లాంచ్ చేయ‌ట్లేదు!

  • వెల్ల‌డించిన హాన‌ర్ హోమ్స్

మూసాపేట్‌లో తాము ప్రీ లాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డం లేద‌ని హాన‌ర్ హోమ్స్ వెల్ల‌డించింది. కొంద‌రు వ్య‌క్తులు కావాల‌ని త‌మ‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించింది. తాము ఈ ప్రాజెక్టును చేప‌డుతున్న విష‌యం వాస్త‌వ‌మేన‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ నిర్మాణం అనుమ‌తుల ద‌శ‌లో ఉంద‌ని పేర్కొంది. కొంద‌రు ఏజెంట్లు అత్యుత్సాహంతో త‌మ వివ‌రాల్ని పేర్కొంటూ రేటు త‌క్కువ అంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలియ‌జేసింది. కాబ‌ట్టి, ఆయా అమ్మ‌కాల‌తో త‌మ‌కెలాంటి సంబంధం లేద‌ని.. కొనుగోలుదారులు ఈ విష‌యం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles