చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ సంస్థ ఎందుకు ఫెయిల్ అయ్యింది? అక్కడ అపార్టుమెంట్లను నిర్మించకపోవడం వల్ల విఫలం కాలేదని గుర్తుంచుకోండి. నిర్మించిన ఫ్లాట్లు అమ్ముడు కాకపోవడం వల్ల ఆ సంస్థ కుప్పకూలింది. ఇదేవిధంగా, హైదరాబాద్ రియల్ రంగంలోనూ రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయా? అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే సాధారణ స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. కేవలం యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాలే జరుగుతున్నాయి. ఫలితంగా వంద ఫ్లాట్లు కట్టే బిల్డర్లు వెయ్యి ఫ్లాట్లను ప్రకటించారు.
రేటు తక్కువ అంటూ అందరి వద్ద సొమ్ము లాగేశారు. ఈ లోపు నిర్మాణ వ్యయం పెరిగింది. భవన నిర్మాణ సామగ్రి ధర అధికమైంది. మరోవైపు బ్యాంకులు క్రమక్రమంగా రుణాల్ని మంజూరు చేయడం తగ్గింది. ఫలితంగా, నిర్మాణాల్ని ముందుకు తీసుకెళ్లలేని దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పలు సంస్థలు హైదరాబాద్లో అమ్మకాల్లేక నానా ఇబ్బందులు పడుతున్నాయి. యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల్ని అరికట్టకపోతే వీరి ఇబ్బందులు మరింత రెట్టింపు అవుతాయి. ఈ దుస్థితిని అధిగమించాలంటే తప్పనిసరిగా యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సిందే.