మీరు ఈఎంఐలు కట్టే లిస్ట్‌లో ఉన్నారా..? ఉన్నట్టుండి ఈఎంఐలు పెరగడం.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆటోమోటిగ్గా లోన్ టెన్యూర్ ఎక్స్‌టెండ్ కావడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? నెలసరి వాయిదాల చెల్లింపు విషయంలో రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న ఈ సమస్యల్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగింది ఆర్బీఐ. ఇక మీదట ఈఎంఐల విషయంలో ఇష్టమొచ్చినట్టు వ్యవహారించడానికి వీల్లేదని లెండర్స్‌కి తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది భారతీయ రిజర్వ్‌బ్యాంక్.
కొత్త ఆర్థిక సంవత్సరంలో రుణగ్రహీతలకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వరస శుభవార్తలు చెబుతోంది. త్వరలో మరోసారి కీలక రెపోరేట్లను తగ్గిస్తారనే వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయ్. ఈ లోగా ఈఎంఐలు కట్టేవారికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇక నుంచి లెండర్స్ ఈఎంఐల్ని ఎడాపెడా పెంచడం.. చెప్పపెట్టకుండా రుణ కాలపరిమితి పొడిగించడం లాంటి నిర్ణయాలు తీసుకోకుండా బ్రేక్ వేసింది ఆర్బీఐ. పారదర్శకతను పెంచడం, రుణగ్రహీత నియంత్రణను మెరుగుపర్చడం.. గృహ- కారు- వ్యక్తిగత రుణాలపై ఊహించని ఛార్జీలను తగ్గించడమే లక్ష్యంగా నెలవారీ వాయిదాల విషయంలో కొత్త నియమాలను ప్రవేశపెట్టింది.
ఈఎంఐ నిబంధనల్లో మార్పులేంటి?
అకస్మాత్తుగా ఈఎంఐలు పెరగడం, రుణ కాలపరిమితుల్ని ఆటోమేటిగ్గా పొడిగించడం.. అస్పష్టమైన రుణ నిబంధనలు సహా ఈఎంఐల చెల్లింపుల విషయంలో లోన్ పేయర్స్ అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ తెచ్చిన కొత్త నియమాలు ఇలాంటి ఇబ్బందుల నుంచి రుణ గ్రహీతలకి ఊరటనిస్తాయ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాల ప్రకారం జరిగిన మార్పులు చూస్తే-
- రుణాల కాలపరిమితిని పెంచే ముందు రుణదాతలు లోన్ పేయర్స్ సమ్మతిని తప్పనిసరిగా పొందాలి.
- అలాగే వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్‌లో ఏదైనా మార్పులుంటే ముందే వాటి గురించి స్పష్టంగా తెలియజేయాలి.
- దీనివల్ల రుణ గ్రహీతలు రుణం పొందే ముందే పూర్తిస్థాయిలో లోన్ డీటైల్స్‌తో కూడిన కీలక వాస్తవ ప్రకటనను పొందుతారు.
- రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిగ్గా ఈఎంఐ పెరుగుదల లేదా కాలపరిమితి పొడగింపులు ఉండకూడదు.
- లోన్ స్టేటిమెంట్స్‌లో వడ్డీ.. ప్రధాన భాగాల మధ్య స్పష్టమైన విభజన ఉండాలి.
ఎంతమేరకు ప్రయోజనం?
ఈ కొత్త మార్పులు రుణగ్రహీతలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయ్..? అనే ప్రశ్నకు సమాధానం- లోన్ రీపేమెంట్ సమయంలో అన్యాయంగా అసంబద్ధంగా జరిగే మార్పుల నుంచి రక్షిస్తాయని చెప్పవచ్చు. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల వల్ల బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు రుణ గ్రహీతలకు తెలియకుండా.. అలాగే వారి సమ్మతి పొందకుండా ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్‌ని మార్చలేవు. గతంలో బ్యాంక్‌లు అప్పు తీసుకొన్న వారిని సంప్రదించకుండానే ఈఎంఐ లేదా రుణ కాలపరిమితిని పొడిగించేవి. ఇక మీదట..
- ఈఎంఐ పెంచాలన్నా లేదా అదే రుణ కాలపరిమితి కొనసాగించాలన్నా..
- రుణ కాలపరిమితిని పొడిగించడానికి.. ఈఎంఐ మారకుండా ఉంచడానికి..
- ఈఎంఐ లేదా కాల పరిమితిని తగ్గించడానికి ముందస్తు చెల్లింపులు చేయడం లాంటి విషయాలపై లోన్ పేయర్స్‌కే పూర్తి నియంత్రణ ఉండనుంది. అలాగే మొత్తం రుణం.. దానికి మంజూరు చేసిన వడ్డీరేటు, కాలపరిమితి ఈఎంఐ వివరాలు, ఫిక్స్‌డ్ లేదా ఫ్లోటింగా ఏ వడ్డీ రకమో ముందే వివరించడం, రుణం మొత్తం ఖర్చు, అన్ని రకాల రుసుములు, ముందస్తు చెల్లింపు, ముందుస్తు ముగింపు ఛార్జీలు ఇలా అన్ని రుణాలకు కీ ఫ్యాక్ట్ స్టేటిమెంట్- KFS ఇక మీదట తప్పనిసరి. గతంలో చాలా బ్యాంక్‌లు ముందస్తు చెల్లింపు ఛార్జీలను దాచిపెట్టేవి. దీనివల్ల రుణగ్రహీతలు లోన్లను ముందుగానే క్లోజ్ చేయడం కష్టమయ్యేది. ఇప్పుడు అన్ని రకాల ఛార్జీలను కేఎఫ్‌ఎస్‌లో స్పష్టంగా పేర్కొనాల్సిందే. దీనివల్ల ముందస్తు చెల్లింపులు సులభతరం అవడంతో పాటు మరింత పారదర్శంగా ఉంటాయ్. ఈఎంఐ గడువు తేదీలు, వడ్డీరేటు మార్పులు, లోన్ బ్యాలెన్స్ వడ్డీ వివరాలు, ప్రీ పేమెంట్ ఆప్షన్స్, యాన్యువల్ లోన్ స్టేటిమెంట్స్ సహా ఏ చిన్న మార్పు జరిగినా రుణగ్రహీతలకు బ్యాంక్‌లు ఎస్‌ఎంస్ లేదా మొబైల్ యాప్‌ల ద్వారా క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాల్సిందే.