డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
బ్యాంకర్లు హైడ్రా ఎన్‌వోసీలను అడగకూడదని.. ఇదే విషయాన్ని త్వరలో జరిగే ఎస్ఎల్‌బీసీ సమావేశాల్లో బ్యాంకర్లకు చెబుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం నరెడ్కో ప్రాపర్టీ షోకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులున్న ప్రాజెక్టుల జోలికి హైడ్రా వెళ్లదన్నారు. పార్క్స్, లేక్స్, రాక్స్‌ను సంరక్షించడానికి హైడ్రా ఏర్పాటైందని.. అది ఎలాంటి ఎన్వోసీలను మంజూరు చేయదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నిర్మాణ రంగం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. నగరం గ్లోబల్ సిటీగా అవతరించేందుకు అవసరమయ్యే అన్నిరకాల చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర్మాణ రంగం అనేది రాష్ట్రాభివృద్ధిలో భాగమని.. కాబట్టి, ఈ పరిశ్రమ ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.