- నిత్యం తప్పుడు ప్రచారం
- బిల్డర్ల మీద ఎప్పుడూ ఆరోపణలే
- తప్పుడు ప్రచారంలో ముందంజ
- ఇలాంటి వారిని ప్రతిఒక్కరూ గుర్తించాలి
- ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు
తమిళనాడుకు చెందిన కృష్ణన్ అనే వ్యక్తి కొత్తగా గచ్చిబౌలిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొన్నాడు. అందులోకి ఎంట్రీ ఇవ్వగానే బిల్డర్ మీద చిందులు వేయడం ఆరంభించారు. ఎక్కడ ఏ చిన్న తప్పు దొర్లినా పెద్దగా రాద్దాంతం చేయడం.. తోటివారికి ఆ విషయాన్ని భూతద్ధంలో చూపెడుతూ.. నానా హంగామా చేయడం అలవాటైంది. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడటం వల్ల అతను చెప్పేదంతా నిజమేనని కొందరు భావించేవారు. సదరు వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కొందరికి అర్థమైనా.. మనకెందుకులే అని నిశబ్దంగా ఉండిపోయేవారు.
మొత్తానికి, బిల్డర్‌కి వ్యతిరేకంగా జనాల్ని ఏకం చేశాడు. కొత్తగా నివాసితుల సంఘాన్ని ఆరంభించాడు. బిల్డర్ నుంచి బలవంతంగా అపార్టుమెంట్ నిర్వహణను లాగేసుకున్నాడు. ఇక అతను ఆడిందే.. పాడిందే పాటగా మారింది. నానాటికీ పరిస్థితులు దిగజారాయి. క్రమక్రమంగా అక్కడి యజమానులకు వాస్తవాలు అర్థమయ్యాయి. బిల్డర్ ఉన్నప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉండేదని కొంతమంది భావించడం మొదలెట్టారు.
ఇందులోని నీతి ఏమిటంటే.. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టుల్లో నివసించేవారు.. ఒకరిద్దరు చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మకూడదు. నిత్యం నెగటివ్‌గా మాట్లాడేవారితో ఆచితూచి వ్యవహరించాలి. వారు చెప్పే అంశాల్లో వాస్తవమెంత ఉందో అంచనా వేయాలి. వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం కొందరు మోసపూరితమైన మాటలు చెప్పే ప్రమాదముంది. వాటిని గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు. ఇలాంటి వ్యక్తులు బిల్డర్ల గురించి ఎప్పుడు తప్పుడు ప్రచారం చేస్తుంటారు.
కాబట్టి, వీరి మాటల్ని గుడ్డిగా నమ్మకుండా.. పంతాలకు పట్టింపులకు వెళ్లకుండా.. ముగ్గురు, నలుగురు వ్యక్తులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని.. కమ్యూనిటీలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలి. అంతేతప్ప, బిల్డర్ మీద వ్యతిరేకంగా వ్యవహరించినా.. వారి మీద స్థానిక సంస్థలకు ఫిర్యాదు చేసినా.. అంతిమంగా ఆయా కమ్యూనిటీయే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొనుగోలుదారుల సమస్యల్ని పెడచెవిన పెట్టే బిల్డర్లను తప్పకుండా దారిలోకి తేవాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, మంచి డెవలపర్లనూ ఇబ్బంది పెట్టకూడదని తెలుసుకోండి.
మంచి బిల్డర్లూ లేకపోలేరు
అధిక శాతం మంది బిల్డర్లు కొనుగోలుదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తారు. ఒకవేళ ఇబ్బందులొచ్చినా పరిష్కరించడంలో ముందుంటారు. కొన్ని సందర్భాల్లో బిల్డర్లు పలు సమస్యల్ని పరిష్కరించలేకపోవచ్చు. అందుకు సాంకేతిక నిపుణులు అవసరం కావొచ్చు.. ఆయా పని ప్రభుత్వంతో ముడిపడి ఉండొచ్చు.. లేక మరే ఇతర కారణాల వల్ల ఆలస్యం కావొచ్చు. అయితే, ఒకరిద్దరూ మూర్ఖశిఖామణులు వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా.. కేవలం బిల్డర్లను తప్పు పడుతుంటారు. బిల్డర్లు చేసిన మంచి పనిని పెద్దగా పట్టించుకోరు.
బిల్డర్లంతా దొంగలంటూ అందరినీ ఒకే గాటిన కట్టేసి మాట్లాడతారు. ఇలాంటి మూర్ఖుల వల్ల.. ప్రాజెక్టును సగంలోనే నిలిపివేయాలన్న కసి బిల్డర్లకు కలిగే ప్రమాదం లేకపోలేదు. బిల్డరును ప్రాజెక్టులో నుంచి బయటికి పంపేయడం తెలివి తక్కువ వ్యవహారం. పంతాలు, పట్టింపులకు వెళ్లకుండా.. కొనుగోలుదారుల అభిప్రాయాల్ని తెలుసుకుని.. ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అప్పుడే గేటెడ్ కమ్యూనిటీలన్నీ ఎలాంటి సమస్యల్లేకుండా ఉంటాయి. మూర్ఖులతో నివాసితులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.