Categories: Uncategorized

సొంతింటి కల.. తీరేందుకు మార్గాలివీ!

  • ధరలు పెరుగుతున్న నేపథ్యంలో
    కొనుగోలుదారుల ఆందోళన
  • కాస్త తెలివిగా ఆలోచిస్తే ఇల్లు కొనడం
    కష్టం కాదంటున్న నిపుణులు

దేశంలో ఎక్కడ చూసినా ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నాయి. ఇన్వెంటరీ కూడా తక్కువగా ఉండటంతో రియల్ రేట్లు చుక్కలను తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో సరైన ప్రాంతంలో సరైన ప్రాపర్టీని కొనడం ఎలా అని చాలామందికి పెద్ద సందేహంగా ఉంటుంది. సొంతింటి కల తీరేనా అనే బెంగా ఉంటుంది. ఇళ్ల ధరలు తగ్గే అవకాశం లేనంత మాత్రాన ఇల్లు కొనలేం అనడానికి లేదు. తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనలివీ..

రేట్లు పెరిగాయి కదా? తగ్గాక కొందం అనే ఎదురుచూపులు రియల్ రంగంలో కుదరవు. ఇక్కడ రేట్లు తగ్గడం అనే ప్రసక్తే ఉండదు. మార్కెట్లో విశ్వసనీయత ఉన్న డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తే చాలు.. అందులోని ఫ్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుకావడం ఖాయం. పైగా ప్రస్తుతం ఇన్వెంటరీ కూడా సాధారణంగానే ఉంది. అమ్ముడుపోని ఇన్వెంటరీ ఆందోళనకరంగా లేదని రియల్ ఎస్టేట్ డేటా ఫ్లాట్ ఫామ్ ప్రాప్ ఈక్విటీ పేర్కొంది. రెండేళ్లలో రియల్ ధరలు రెట్టింపు అయిన గురుగ్రామ్ లో కూడా సరఫరా తక్కువగానే ఉందనే విషయం ఇక్కడ గమనించాలి. 2019 నుంచి చూస్తే ఢిల్లీలో ధరలు 212 శాతం పెరిగాయి. ఇన్వెంటరీ 26 నెలల నుంచి 11 నెలలకు తగ్గింది.

భారతదేశంలో అత్యంత ఖరీదైన మార్కెట్ గా నిలిచిన ముంబైలో అదే కాలంలో 28 శాతం పెరుగుదలను చూడగా.. అమ్ముడుపోని ఇన్వెంటరీ 14 నెలలుగా ఉంది. బెంగళూరులో 67 శాతం ధరలు పెరగ్గా.. ఇన్వెంటరీ 13 నెలలకు తగ్గింది. 20 నెలల్లో అత్యధికంగా అమ్ముడుపోని స్టాక్‌ను కలిగి ఉన్నప్పటికీ, హైదరాబాద్ ధరలు స్థిరంగా ఉన్నాయి. భూమి ధరలు ఎక్కడా తగ్గడంలేదు. అయినప్పటికీ డెవలపర్లు వెనుకంజ వేయడంలేదు. అయితే, ఇకపై అల్ట్రా లగ్జరీ (రూ.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్లు) అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని అంచనా.

అటు భూముల ధరలు, ఇటు నిర్మాణ వ్యయం పెరగడంతో ఆటోమేటిగ్గా ఇళ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారి సగటు మధ్యతరగతి ప్రజలకు ఇది ఆశనిపాతమే అయినప్పటికీ.. సొంతింటి కల నెరవేర్చుకోవడం అసాధ్యం మాత్రం కాదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహ కొనుగోలుదారులకు ఇంటి కొనుగోలును సులభతరం చేయడానికి బిల్డర్లు సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. కొందరు 20:30:50 ప్లాన్‌ అందిస్తున్నారు. డెవలపర్లు ధరలు తగ్గించుకున్నా.. సౌకర్యవంతమైన చెల్లింపు విధానాలు అందుబాటులోకి తీసుకురావడం కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారికి సానుకూలమైన అంశమే. ఇక రీసేల్‌ మార్కెట్ అనేది చాలామంది చేతిలో వజ్రాయుధమే. డెవలపర్లు ధరలు తగ్గించరు. కానీ పెట్టుబడిదారులు తగ్గించే అవకాశం ఉంది. ప్రధాన నగరాల్లోని కీలక మార్కెట్లలో సంపన్నులు ఇళ్లు కొని అమ్మడం చేస్తుంటారు. అలాంటి ప్రాపర్టీలను గుర్తించగలిగితే కాస్త తక్కువ ధరకే ఇంటిని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

కొన్ని ప్రాజెక్టులలో పునఃవిక్రయ ధరలు ఇప్పటికే బిల్డర్ ప్రస్తుత రేటు కంటే తక్కువగా ఉంటున్నాయి. డెవలపర్ తో సంప్రదింపులు జరిపే సమయంలో ఈ విషయం ప్రస్తావిస్తే.. అతడు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ధర విషయం పక్కనపెడితే.. ఇల్లు కొనే ముందు తప్పనిసరిగా చేయాల్సిన అంశం ఒకటి ఉంది. అదే.. అన్ని పత్రాలనూ క్షుణ్నంగా పరిశీలించడం. రెరా వెబ్ సైట్ కి వెళ్లి సదరు డెవలపర్ దాఖలు చేసిన అన్ని పత్రాలనూ పరిశీలించాలి. ప్రాజెక్టు సమయపాలన ఎలా ఉందో చూడాలి. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత సమయం ఉంది? అంతకాలం పాటు అటు అద్దె, ఇటు ఈఎంఐ చెల్లించగలమా లేదా అనేది నిర్ధారించుకోవాలి. కొన్ని ప్రాజెక్టుల డెవలపర్లు కొన్ని నెలలపాటు ఈఎంఐ తామే భరిస్తామనే ఆఫర్లు ఇస్తుంటారు. అలాంటిది ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఇక ఇటీవలే గృహ కొనుగోలుదారులకు ఆర్బీఐ తీపికబురు అందించింది. చాలా కాలం తర్వాత రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనివల్ల ఇంటి రుణాల వడ్డీ భారం కాస్త తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సొంతింటి కల నెరవేర్చుకోవడం కష్టం కాదని, కాస్త ఆలోచించి, అన్నీ పరిశీలించి చక్కని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

This website uses cookies.