- బెంగళూరులో ఇంచ్ ఇంచ్ ఇంపార్టెంటే
- అద్దెల కోసం కొత్త పుంతలు తొక్కుతున్న యజమానులు
- 350 చదరపు అడుగుల్లోపే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్
బెంగళూరు.. ఐటీ రాజధాని. ఇక్కడ అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్దెలూ ఎక్కువే.. సెక్యూరిటీ డిపాజిట్టూ ఎక్కువే. అందువల్ల ప్రతి అంగుళమూ ముఖ్యమే. అత్యంత చిన్న ఫ్లాట్ అద్దె కూడా రూ.20వేలకు పైనే ఉంటున్నాయి. దీంతో అద్దె కోసం సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ స్థలాన్ని కూడా రెండు ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు. 350 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలంలో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఉంటున్నాయి. చివరకు గ్యారేజీలు, స్టోర్ రూమ్స్ ను సైతం కొంచెం మార్చి అద్దెకు ఇచ్చేస్తున్నారు.
350 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండే సింగిల్ బెడ్ రూమ్స్ ఫ్లాట్లను పరిశీలిస్తే.. లివింగ్ రూమ్‌లో సోఫాకు తగినంత స్థలం కూడా ఉండదు. అటూ ఇటూ స్వేచ్చగా తిరిగే వెసులుబాటు కూడా కనిపించదు. నిజానికి 2023 నుంచి బెంగళూరులో కోరమంగళ, సర్జాపూర్ రోడ్, వైట్‌ఫీల్డ్, బెల్లాండూర్ సహా అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలలో వార్షిక అద్దె 35 శాతం వరకు పెరిగింది. కరోనా సమయంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఇంటి యజమానులు ప్రయత్నించడం.. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగి అద్దెలు పెరిగాయి. ప్రస్తుతం బెంగళూరు గృహ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అపార్ట్ మెంట్ అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో అద్దెదారులు ఒత్తిడికి గురవుతున్నారు. అద్దె ఆదాయాన్ని పెంచడానికి ఆస్తి యజమానులు డిమాండ్-సరఫరా అసమతుల్యతను ఉపయోగించుకుంటున్నందున ఇది అసాధారణ అద్దె స్థలాల పెరుగుదలకు దారితీసింది. అలాగే హౌసింగ్ ఇన్వెంటరీ కొరత అసాధారణ అద్దె స్థలాల పెరుగుదలకు దారితీసింది.