కామన్ ఏరియాలతోపాటు కార్ పార్కింగ్ స్లాట్ లను విడిగా అమ్మడం సరికాదని.. కొనుగోలుదారుల నుంచి తీసుకున్న ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని వెర్టెక్స్ సిరి డెవలపర్స్ కు ఏపీ రెరా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి ఫిర్యాదుదారులు పేర్కొన్న నిర్మాణ లోపాలను వెంటనే పరిష్కరించాలని స్పష్టంచేసింది.
వెర్టెక్స్ సిరి సిగ్నా ప్రాజెక్టులోని టవర్-ఏ లో విజయవాడకు చెందిన పి.సత్యనారాయణ, పి.అనూరాధా కలిసి రూ.71,75,000కు ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. 2019 జూలై 4న దీనికి సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు. 830 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాకు, 515 చదరపు అడుగులు కామన్ ఏరియాకు, 120 చదరపు అడుగుల కార్ పార్కింగ్ కు కలిసి ఈ మొత్తం చెల్లించారు. ఇతర సౌకర్యాల కోసం అదనంగా మరో రూ.2.5 లక్షలు చెల్లించారు.
అయితే, కామన్ ఏరియాలను, కార్ పార్కింగ్ స్లాట్ లను విడిగా అమ్మడం అక్రమని.. అలాగే నిర్మాణంలో చాలా లోపాలున్నాయని, కార్పస్ ఫండ్, నిర్వహణ ఖాతాలను బదిలీ చేయలేదని, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్న హామీని విస్మరించారని, సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు సంబంధించి కార్పస్ ఫండ్ పెట్టలేదని పేర్కొంటూ కొనుగోలుదారులు ఏపీ రెరాను ఆశ్రయించారు. కామన్ ఏరియాకు చదరపు అడుగుకు రూ.5వేల చొప్పున రూ.25,75,000, కార్ పార్కింగ్ స్లాట్ కు రూ.2 లక్షలు డెవలపర్ వసూలు చేశారని.. నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కామన్ ఏరియా కోసం వసూలు చేసిన రూ.25,75,000, కార్ పార్కింగ్ కోసం తీసుకున్న రూ.2 లక్షలను 24 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.
కార్ పార్కింగ్ స్లాట్ కోసం డబ్బులు వసూలు చేసినప్పటికీ, సరైన విధంగా పార్కింగ్ స్పేస్ కేటాయించలేద, ఏకపక్షంగా, తమకు నచ్చినట్టు ఇచ్చారన్నారు. ప్రాజెక్టు బ్రౌచర్ లో మాత్రం తొలుత వచ్చిన వారికి తొలుత ప్రాతిపదికగా కార్ పార్కింగ్ ఇస్తామని చెప్పినట్టు నివేదించారు. దీనిపై విచారణ జరిపిన రెరా.. నిర్మాణపరమైన లోపాలను గుర్తించేందుకు వి.ఆర్.సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వాస్తవాలను పరిశీలించి తన నివేదికను రెరాకు సమర్పించింది. నిర్మాణపరమైన లోపాలను పరిష్కరించేందుకు కొన్ని సూచనలు చేసింది. ఆ లోపాలను 30 రోజుల్లోగా సరిచేయాలని 2023 జూలై 27న డెవలపర్ ను రెరా ఆదేశించింది. వాటిని డెవలపర్ సరిగా చేయలేదని.. ఫలితంగా వర్షపు నీరు లీకేజీ జరుగుతోందని ఫిర్యాదుదారులు రెరా దృష్టికి తీసుకెళ్లారు. వాదనలన్నీ విన్న రెరా.. తాజాగా తుది ఆదేశాలు జారీ చేసింది.
బేస్ మెంట్-1, బేస్ మెంట్-2 లో కార్ పార్కింగ్ స్లాట్ లు ఏర్పాటు చేశారని.. ఆంధ్రప్రదేశ్ (అపార్ట్ మెంట్ ప్రమోషన్ ఆప్ కన్ స్ట్రక్షన్ అండ్ ఓనర్ షిప్) చట్టం, 1987లోని సెక్షన్ 2(ఎన్) ప్రకారం.. బేస్ మెంట్ అనేది కామన్ ఏరియా కిందకు వస్తుందని.. అందువల్ల దానిని విడిగా విక్రయించడానికి వీల్లేదని రెరా స్పష్టంచేసింది. అనుమతి పొందిన ప్లాన్ లో దానిని కార్ పార్కింగ్ ఏరియాగా పేర్కొన్నప్పటికీ అమ్మడం కుదరదని పేర్కొంది. రెరా చట్టం ప్రకారం కూడా కామన్ ఏరియాలోని కార్ పార్కింగ్ స్పేస్ ను అమ్మడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. అపార్ట్ మెంట్ కు సంబంధించి చదరపు అడుగు ధరలో కామన్ ఏరియా కూడి కలిపే ఉంటుందని స్పష్టంచేసింది.
ఈ నేపథ్యంలో కామన్ ఏరియాలోని అన్ని సౌకర్యాలనూ సంబంధిత తాళం చెవులు, డాక్యుమెంట్లతో కొత్తగా ఏర్పాటైన అసోసియేషన్ కు అప్పగించాలని డెవలపర్ ను ఆదేశించింది. 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే పార్కింగ్ స్పేస్ లను తొలుత వచ్చినవారికి తొలుత ప్రాతిపదికన మళ్లీ కేటాయించాలని ఆదేశించింది. నిర్మాణపరమైన లోపాలను 60 రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టంచేసింది. సరిహద్దు గోడపై సోలార్ ఫెన్సింగ్ ను 30 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. కామన్ ఏరియా కోసం వసూలు చేసిన రూ.25,75,000ను 11 శాతం వడ్డీతో, కార్ పార్కింగ్ కోసం తీసుకున్న రూ.2 లక్షలను 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కార్పస్ ఫండ్, నిర్వహణ ఖాతాలను కొత్త అసోసియేషన్ కు బదిలీ చేయాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గానూ డెవలపర్ కు రూ.10 లక్షల జరిమానా విధించింది. 30 రోజుల్లోగా ఈ మొత్తాన్ని రెరాకు చెల్లించాలని స్పష్టంచేసింది. అలాగే లీగల్ ఖర్చుల నిమిత్తం ఫిర్యాదుదారులకు రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది.
This website uses cookies.