పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కల నెరవేర్చే దిశగా కేంద్రం మరికొన్ని చర్యలు చేపట్టింది. ఇంటి రుణాలకు సంబంధించి వడ్డీ రాయితీ ఇవ్వనుంది. దీనికి సంబంధించిన కొత్త పథకాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. పథకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మాట్లాడినప్పుడు.. పట్టణ పేదల కోసం కొత్తగా వడ్డీ రాయితీ పథకాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించారు. ‘మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు అనేది ఓ కల.
పట్టణాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తున్న అలాంటి కుటుంబాలకు లాభం చేకూర్చేలా కొత్త వడ్డీ రాయితీ పథకాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నాం. తద్వారా వారికి లక్షలాది రూపాయల మేర లబ్ధి చేకూరుతుంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పథకం తుది విధివిధానాలు ఖరారు కావడంతో త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కొనసాగింపుగా ఈ కొత్త పథకం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.