మంత్రులు, ఎమ్మెల్యేలకు
ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
ఇసుక వ్యవహారంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. అక్రమాలు, అవినీతికి తావులేకుండా సామాన్యులకు ఇసుకను అందుబాటులో ఉంచేందుకే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2014-2019లో టీడీపీ హయాంలోనే ఉచిత ఇసుక పథకం తెచ్చినప్పటికీ.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ల వల్ల అప్పట్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకూడదని.. మంత్రులెవరూ ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టంచేశారు. ఎవరైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే.. వారిని కేబినెట్ నుంచి తీసివేయడానికి కూడా వెనకాడనని హెచ్చరించారు. ఈ విషయాల్ని ఎమ్మెల్యేలకు కూడా చెప్పాలని మంత్రులకు సూచించారు.