క్రెడాయ్ జాతీయ కార్యదర్శిగా గుమ్మి రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన సుమారు రెండేళ్లు ఉంటారు. ఇప్పటివరకూ ఆయన క్రెడాయ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతల్ని నిర్వర్తించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి క్రెడాయ్ నేషనల్‌కి ప్రాతినిధ్యం వహించిన గుమ్మి రాంరెడ్డి.. గత కొన్నేళ్లుగా క్రెడాయ్ నేషనల్ విస్తరణలో ముఖ్య భూమిక పోషించారు. జాతీయ స్థాయిలో బలోపేతం అయ్యేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన పనితీరు, పనులను పూర్తి చేయడంలో నిబద్ధత, కలుపుగోలుతనం, వినూత్నంగా ఆలోచించడం వంటి అంశాలే ఆయన్ని క్రెడాయ్ జాతీయ స్థాయిలో కార్యదర్శిగా నిలబెట్టాయని పలువురు డెవలపర్లు అభిప్రాయపడ్డారు. ఇజ్రాయేల్‌లో జరిపిన క్రెడాయ్ న్యాట్‌కాన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో గుమ్మి రాంరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన ప్రస్తుతం ఆర్క్ గ్రూప్ సీఎండీగా వ్యవహరిస్తున్నారు.
* కేవలం నిర్మాణాల్ని మాత్రమే చేపట్టడం కాకుండా.. సమాజసేవలో తనదైన ప్రత్యేకతను నిరూపిస్తున్నారు. యువతను సన్మార్గంలో నడిపిస్తూ.. వారి లక్ష్యాల్ని చేరుకోవడానికి అవసరమయ్యేందుకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. వందలాది మంది విద్యార్థుల్ని చదివిస్తూ.. క్రీడల్లో రాణించేందుకు విశేషంగా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల భారత అండర్ 19 మహిళల క్రికెట్ జట్టులో మెరిసిన త్రిష ప్రతిభను ఆయన అందరి కంటే ముందే గుర్తించారు. దాదాపు ఆమె భారత జట్టులో ఎంపిక అయ్యే వరకూ ఆర్క్ ఫౌండేషన్ నుంచి ప్రోత్సహించారు. వివిధ ఆటల్లో రాణిస్తున్న యువ క్రీడాకారులకు సరైన శిక్షణను అందించేందుకు తోడ్పాటును అందిస్తున్నారు.