- రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ రంగం సమస్యల్ని తెలుసుకుంటాం
- హైదరాబాద్‌లో సొంత ఆఫీసు ఏర్పాటు చేస్తాం
- యూడీఎస్‌కు క్రెడాయ్ తెలంగాణ వ్యతిరేకం
- కోడ్ ఆఫ్ కండక్ట్ క్రెడాయ్ బిల్డర్లు పాటిస్తారు
- క్రెడాయ్ తెలంగాణ నూతన అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి
రాష్ట్రంలోని క్రెడాయ్ తెలంగాణ ఛాప్టర్లకు చెందిన వివిధ బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేక టూర్ ప్లాన్ చేస్తున్నామని నూతన అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రప్రథమంగా రియల్ ఎస్టేట్ గురుకి ప్రత్యేక ఇంటర్వ్యూనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రెడాయ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులంతా కలిసి ఛాప్టర్లను సందర్శించడం వల్ల అక్కడి సభ్యుల్ని ప్రోత్సహిస్తామని.. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో మురళీకృష్ణారెడ్డి మాటల్లోనే..
క్రెడాయ్ అంటేనే కోడ్ ఆఫ్ కండక్ట్.. ప్రతిఒక్క బిల్డర్ తప్పకుండా పాటించాల్సిందే.. ప్రతిఒక్కరూ నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా రెరా అనుమతుల్ని తీసుకునేలా నిర్మాణాల్ని చేపట్టే విధంగా ప్రోత్సహిస్తాం. అంటే, క్రెడాయ్ తెలంగాణ బిల్డర్ల వద్ద ఫ్లాట్లు కానీ విల్లాలు కానీ కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలుండవనే విషయాన్ని కొనుగోలుదారుల్లోకి అర్థమయ్యేలా చేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యం. ఇలా, రాష్ట్రంలోని 33 జిల్లాల బిల్డర్లు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహిస్తాం. క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని అనేక అంశాల్ని రెరా చట్టంలో పొందుపరిచారు. మనదేశంలో రెరా చట్టం 2017లో వచ్చింది. మేం దశాబ్దం క్రితమే ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగానే నిర్మాణాల్ని చేపడుతున్నాం.
మురళీకృష్ణారెడ్డి నేపథ్యం.. (బాక్స్)
మురళీకృష్ణారెడ్డి స్వస్థలం వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామం. తాలూకా కొల్లాపూర్. ప్రస్తుతం ఇది వనపర్తి జిల్లాలో ఉంది. 1976లో సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆతర్వాత పలు వ్యాపారాల్ని నిర్వహించారు. 1987లో విద్యారంగంలోకి ప్రవేశించారు. సొంత జిల్లా వాసులకు నాణ్యమైన గృహాల్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో 1994లో భగీరథ కాలనీ అనే విల్లా ప్రాజెక్టు చేపట్టారు. అప్పట్లో అదే ప్రప్రథమ డీటీసీపీ ప్రాజెక్టు. ఆతర్వాత నలగండ్లలో 1999లో లక్ష్మీ విహార్ చేపట్టారు. ఆరంభంలో విల్లాను రూ.10-12 లక్షలకే అమ్మారు. అప్పట్లో అందరూ బీహెచ్ఈఎల్ ఉద్యోగులే కొన్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన ఇద్దరు కుమారులు అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.