* నోబ్రోకర్‌లో సైబర్ నేరగాళ్లు
* అద్దె తక్కువంటూ ప్రకటనలు
* వాటిని చూసి గుడ్డిగా నమ్మకండి
* ఫ్లాట్ చూశాకే అద్దె చెల్లించండి
బ్రోకర్‌కు ఒకట్రెండు శాతం ఎందుకివ్వాలనే ఆలోచనతో కొందరు నో బ్రోకర్ వంటి సైట్లలో ఫ్లాట్లను అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, అందులోనూ సైబర్ నేరగాళ్లు ఉంటారని.. వాళ్లూ తప్పుడు ప్రకటనల్ని గుప్పించి.. లక్షల రూపాయల్ని వసూలు చేసి మోసం చేస్తుంటారని తాజా ఉదంతంతో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మదీనాగూడకు చెందిన కమ్లేష్ అనే వ్యక్తి మైహోమ్ జ్యుయల్‌లో సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె ప్రకటనను నో బ్రోకర్ డాట్‌కామ్‌లో ఇటీవల చూశాడు. అసలే మై హోమ్ జ్యుయల్.. అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ.. అందులో సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్.. వావ్, ఇదో బంపర్ ఆఫర్ అనుకున్నాడు. ప్రదీప్ కుమార్ శర్మ అనే అతను ఆయా ఫ్లాట్ యజమానిగా పేర్కొంటూ కమ్లేష్‌తో మాట్లాడారు. ఫ్లాట్, అద్దె, డిపాజిట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాడు. ఫ్లాట్‌ను చూడటానికి కమ్లేష్ ఆధార్ కార్డు, ఇతర ఆఫిషీయల్ ఐడీ కూడా చూపెట్టమన్నాడు. ఫ్లాట్‌ను చూడటానికి రావాలంటే ముందుగా ఒక ఐడీ జనరేట్ చేయాల్సి ఉంటుందని.. అందుకోసం తన మేనేజర్‌కు తొలుత రూ. 2 వేలు చెల్లించాలని సూచించాడు. సైట్ విజిట్ అవ్వగానే సొమ్ము వెనక్కి ఇచ్చేస్తామని నమ్మబలికాడు. తర్వాత మేనేజర్ కాల్ చేసి.. రెండు వేలతో పాటు.. రెండో స్టెప్‌గా రూ.7 వేలు చెల్లించాలన్నాడు. ఆ మొత్తం సైట్ విజిట్ అయ్యాక ఐదు నిమిషాల్లో వెనక్కి వచ్చేస్తాయని తెలిపాడు. తొమ్మిది వేలు చెల్లించిన తర్వాత.. తమ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలొస్తున్నాయని.. కాబట్టి, మొదటి నెల అద్దె వేస్తే మూడో స్టెప్ వెరిఫికేషన్ పూర్తవుతుందని మేనేజర్ అన్నాడు.
* ఆతర్వాత కమ్లేష్ ముందు, ఓనర్ ప్రదీప్ కుమార్.. కస్టమర్‌ను ఇబ్బంది పెట్టొద్దని మేనేజర్‌ను గట్టిగా తిట్టాడు. కస్టమర్లను ఇబ్బంది పెడుతున్నందుకు ఉద్యోగానికి రావొద్దని ప్రదీప్ కుమార్ హెచ్చరించాడు. సాంకేతిక సమస్య కారణంగా తన ఉద్యోగానికి ఎసరొచ్చిందని అతని మేనేజర్ కూడా భలే నటించాడు. అది విని కమ్లేష్ కూడా నిజమేనని నమ్మాడు. ఎందుకంటే నోబ్రోకర్ సైటు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని గట్టిగా నమ్మడమే ఇందుక ప్రధాన కారణం. మొత్తానికి గాను.. కమ్లేష్ 12 లావాదేవీల్లో సుమారు రూ.2,71,198ను ఫ్లాట్‌ను చూడకుండానే చెల్లించేశాడు. ఇందుకు సంబంధించిన నకిలీ రశీదులను కూడా వారు కమ్లేష్‌కు అందజేశారు. అయితే, రెండో స్టెప్ లోనే కమ్లేష్‌కు సందేహం వచ్చి.. మోసం చేస్తే పోలీసుకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. అయినా, అతను సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ ప్రకటన ఇంకా నో బ్రోకర్ డాట్‌కామ్‌లో కనిపిస్తూ ఉందంటూ కమ్లేష్ తెలిపాడు. ఇందుకు నోబ్రోకర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటున్నాడు.