ట్రిపుల్ వన్ జీవో రద్దు కాదనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రకృతితో ఆటలాడటం అంత సులువేం కాదని ప్రజలకూ అర్థమైంది. అంతెందుకు, కొందరు ప్రభుత్వ పెద్దలూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కాకపోతే, ఎన్నికల సంవత్సరం కాబట్టి.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే, ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేసింది. ఈ విషయం అక్కడి స్థానికులకూ క్రమక్రమంగా అర్థమవుతోంది. అయితే గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లు.. ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేస్తామని ప్రకటించింది కాబట్టి.. తమ భూముల రేట్లు పెరుగుతాయనే ఆలోచనలో 84 గ్రామాల ప్రజలున్నారు. మరి, ఈ రద్దు ప్రభావం హైదరాబాద్ రియాల్టీ మీద ఏ మేరకు పడుతుంది?
ఇప్పుడున్న పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి దాదాపు ముప్పయ్యేళ్లు పట్టింది. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి వంటి ప్రాంతాల్లో రహదారులు, మంచినీరు, విద్యుత్తు వంటివి రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదు. కాబట్టి, కోకాపేట్ పక్కనే ఉన్న ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాలు వృద్ధిలోకి రావడానికి ఎంతలేదన్నా పది నుంచి పదిహేనేళ్లు పడుతుంది. ఈలోపు రియల్టర్లు, బ్రోకర్లు కలిసి అక్కడి భూముల రేట్లను అమాంతం పెంచేస్తారు. అయితే, అక్కడ నాణ్యమైన గృహాలు రావడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుంది. ఎన్‌జీటీ, సుప్రీం కోర్టు వంటివి గనక ట్రిపుల్ వన్ జీవో రద్దుకు అంగీకరిస్తేనే అది సాధ్యపడుతుందని గుర్తుంచుకోండి. లేకపోతే, ఇప్పటి మాదిరిగా.. అక్రమంగా విల్లాలు, వ్యక్తిగత గృహాలను అమ్మాల్సి ఉంటుంది.
This website uses cookies.