Categories: TOP STORIES

గార్ కార్ప్ ఛైర్మ‌న్‌.. జీ అమ‌రేంద ర్‌రెడ్డి దేశీయ రియాల్టీ కుబేరుల్లో ప‌దో స్థానం

రియల్టీ కుబేరుడు డీఎల్ఎఫ్ రాజీవ్ సింగ్
రూ. 59,030 కోట్ల సంపదతో గ్రోహె-హురున్ ఇండియా లిస్టులో అగ్రస్థానం

భారత్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రూ. 59,030 కోట్ల సంపదతో మరోసారి నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి దేశీయ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్‌ ఫిటింగ్స్ సంస్థ గ్రోహె, రీసెర్చ్ సంస్థ హురున్ ఇండియా సంయుక్తంగా ఈ లిస్టును రూపొందించింది. 16 నగరాలకు చెందిన 67 కంపెనీలకు సంబంధించి 100 మంది సంపన్నులకు ర్యాంకులు ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది చోటు దక్కించుకున్నారు. జీఏఆర్‌ కార్పొరేషన్‌ వ్యవస్థాపక చైర్మన్ జీ అమరేందర్ రెడ్డి కుటుంబం (రూ. 15,000 కోట్లు) పదో స్థానంలో నిల్చింది.

రెండో స్థానంలో రూ. 42,270 కోట్లతో మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం (మాక్రోటెక్ డెవలపర్స్ – లోధా గ్రూప్) నిలిచారు. రూ. 37,000 కోట్లతో ఆర్ఎంజెడ్ కార్ప్‌కి చెందిన అర్జున్ మెండా కుటుంబం మూడో స్థానంలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 37 మంది రియల్టీ కుబేరులు ఉన్నారు. ఢిల్లీ (23), కర్ణాటక (18) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 9 మంది, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరు ఉన్నారు. తెలుగువారి విషయానికి వస్తే.. మైహోం కన్ స్ట్రక్షన్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబం రూ. 9,490 కోట్లతో 13వ స్థానంలో ఉంది. సి. వెంకటేశ్వర రెడ్డి (అపర్ణ కన్‌స్ట్రక్షన్స్) రూ.5,940 కోట్లతో 16వ స్థానంలో, ఎస్ సుబ్రమణ్యం రెడ్డి (అపర్ణ కన్‌స్ట్రక్షన్స్) రూ.5,880 కోట్లతో 17వ స్థానంలో, మనోజ్ నంబూరు (అలయన్స్ ఇన్‌ఫ్రా) రూ. 3,900 కోట్లతో 29వ స్థానంలో ఉన్నారు. ఇక రాంకీ ఎస్టేట్స్ అధినేత అయోధ్య రామిరెడ్డి రూ.1420 కోట్లతో 46వ స్థానంలో, సునీల్ బొమ్మిరెడ్డి (అలయన్స్ ఇన్‌ఫ్రా) రూ.1,300 కోట్లతో 49వ స్థానంలో, సురేంద్ర బొమ్మిరెడ్డి (అలయన్స్ ఇన్‌ఫ్రా), రూ.1,300 కోట్లతో 49వ స్థానంలో, జీవీకే రెడ్డి కుటుంబం (తాజ్ జీవీకే హోటల్స్) రూ.700 కోట్లతో 78వ స్థానంలో ఉన్నారు.

This website uses cookies.