విశాలమైన, విలాసవంత ఇళ్లవైపు కొనుగోలుదారుల మొగ్గే కారణం
లాభాల కోణంలో డెవలపర్లది కూడా అదే బాట
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతున్నప్పటికీ.. చాలామంది విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకే మొగ్గు చూపిస్తుండటంతో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు తగ్గుతున్నాయ్. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే.. ఈ ఏడాది అదే సమయంలో ఈ ఇళ్ల అమ్మకాలు 4 శాతం మేర తగ్గి 61,121 యూనిట్లకు పరిమితమయ్యాయి. రూ. 60 లక్షల లోపు ధర కలిగిన అందుబాటు ఇళ్లు గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 63,787 ఇళ్లు అమ్ముడయ్యాయి. కానీ ఈ ఏడాదికి వచ్చేసరికి వాటి అమ్మకాలు తగ్గాయి. తక్కువ సరఫరా ఉండటం, జనం లగ్జరీ అపార్ట్ మెంట్లవైపు దృష్టి సారించడం వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణాలని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గతేడాది మొదటి త్రైమాసికంలో 52,818 అందుబాటు ఇళ్లు సరఫరా కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అవి 33,420 యూనిట్లకే పరిమితమయ్యాయి. అందుబాటు ధరల ఇళ్లతో పోలిస్తే ప్రీమియం, లగ్జరీ ఇళ్ల ప్రాజెక్టుల్లో లాభాలు ఎక్కువగా ఉండటంతో డెవలపర్లు కూడా వాటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనివల్లే అందుబాటు ధరల ఇళ్ల సరఫరా, అమ్మకాలు కూడా తగ్గుతున్నాయి. 2022 మొత్తం 2,51,198 ఇళ్లు అమ్ముడుకాగా, 2023లో అవి 2,35,340 యూనిట్లకు
తగ్గాయి. అలాగే 2019లో రూ.60 లక్షలలోపు ధర కలిగిన ఇళ్లు 2,26,414 అమ్ముడుకాగా, 2020లో కరోనా కారణంగా 1,88,233 యూనిట్లకే అమ్మకాలు పరిమితమయ్యాయి. అయితే, 2021లో మళ్లీ పుంజుకున్నాయి. ఆ ఏడాది 2,17,274 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022లోనూ వీటి అమ్మకాలు పెరగ్గా.. 2023 నుంచి తగ్గడం ప్రారంభించాయి. హైదరాబాద్ లో కూడా ఈ ఇళ్ల అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 3,674 ఇళ్లు అమ్ముడవగా.. ఈ ఏడాది అదే సమయంలో 3,360 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. రియల్ ధరలు అధికంగా ఉన్న ముంబై మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ గతేడాది తొలి త్రైమాసికంలో 23,401 యూనిట్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అవి 28,826 యూనిట్లకు పెరిగాయి.
This website uses cookies.