Categories: TOP STORIES

జయత్రి ఇన్ ఫ్రాస్టక్చర్స్ ప్రాజెక్టు నిలిపివేత

పలు ఫిర్యాదలు నేపథ్యంలో తెలంగాణ రెరా నిర్ణయం

జయ డైమండ్ పేరుతో రెరాలో నమోదైన ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని జయత్రి ఇన్ ఫ్రాస్టక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను తెలంగాణ రెరా ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రెరా ఈ నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుదారులు శ్రీవత్సల, మరికొందరు కలిసి జయ డైమండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడి రెరాకు సంయుక్తంగా ఫిర్యాదు చేశారు. డెవలపర్ కు ఎన్నిసార్లు చెప్పినా.. నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమయ్యారని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదును పరిశీలించిన రెరా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్రమోషన్, ఇతర లావాదేవీలతోపాటు బుకింగ్ సంబంధిత చర్యలన్నీ తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

ALSO READ: మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం..

అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన భూమి లేదా అందులో భాగం, అలాగే ఏదైనా యూనిట్ ను మార్చడం లేదా బదిలీ చేయడం వంటివి కూడా చేయొద్దని స్పష్టంచేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లూ చేయొద్దని సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు సూచించింది. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ను సస్పెన్షన్ లో ఉంచడంతోపాటు ఆన్ లైన్ యాక్సెస్ బ్లాక్ చేయాలని, ప్రాజెక్టు బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయాలని, ఈ ఉత్తర్వులను టీజీ రెరా వెబ్ పేజీలో అందుబాటులో ఉంచాలని టీజీ రెరా కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.

This website uses cookies.