Categories: TOP STORIES

పెరగనున్న ప్రాపర్టీ ధరలు

  • కొత్త ప్రాజెక్టుల్లో ధరలు 9 శాతం పెరిగే అవకాశం
  • ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి

దేశంలో ప్రాపర్టీ ధరలు పెరగనున్నాయి. ఈ ఏడాది దేశంలోని 9 ప్రధాన నగరాల్లోని కొత్త ప్రాజెక్టుల ధరలు 9 శాతం మేర పెరిగే అవకాశం ఉందని డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 2024-25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చదరపు అడుగు రూ.13,197కి చేరుకుంటుందని తన తాజా నివేదికలో పేర్కొంది. గత ఏడాది కాలంలో కోల్‌కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29% పెరిగాయి. ఆ తర్వాత థానే (17%), బెంగళూరు (15%), పూణే (10%), ఢిల్లీ-ఎన్‌సిఆర్ (5%), హైదరాబాద్ (5%) మరియు చెన్నై (4%) ఉన్నాయి.

ముంబై, నవీ ముంబైలలో ఇళ్ల ధరలు 3% తగ్గాయి. కాగా, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (FY23-25) ఇళ్ల ధరలు 18% పెరిగాయి. బెంగళూరు 44% అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. కోల్‌కతా (29%), చెన్నై(25%), థానే (23%), ఢిల్లీ-ఎన్‌సిఆర్ (20%), పూణే (18%), నవీ ముంబై (13%), ముంబై (11%), హైదరాబాద్ (5%) పెరుగుదల నమోదు చేసిందని నివేదిక తెలిపింది. మరోవైపు ఈ ఏడాది జనవరి-మార్చిలో గృహాల అమ్మకాలు 23% తగ్గి 1,05,791 యూనిట్లకు చేరుకోగా, సరఫరా 34% తగ్గి 80,774కు చేరుకుంది.

ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల్లో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చదరపు అడుగు సగటు ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కి పెరిగింది. కోల్‌కతాలో చదరపు అడుగు ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగిందని నివేదిక పేర్కొంది. చెన్నైలో రేట్లు చదరపు అడుగుకు రూ.7,645 నుంచి రూ.7,989కి పెరిగాయి. హైదరాబాద్ లో చదరపు అడుగుకు రూ.7,890 నుంచి రూ.8,306కి పెరిగాయి, పూణే చదరపు అడుగుకు రూ.9,877 నుంచి రూ.10,832కి పెరిగింది. థానేలో సగటు ధరలు చదరపు అడుగుకు రూ.11,030 నుంచి రూ,12,880కి పెరిగాయి. ఢిల్లీలో చదరపు అడుగుకు రూ.13,396 నుంచి రూ.14,020కి పెరిగాయి.

 అయితే, నవీ ముంబైలో ధరలు చదరపు అడుగుకు రూ.13,286 నుంచి రూ.12,855కి తగ్గాయి. ముంబైలో కూడా గత ఆర్థిక సంవత్సరంలో చదరపు అడుగు ధర రూ.34,026కి తగ్గింది. 2023-24లో ఇది రూ.35,215 ఉంది. “బెంగళూరు, కోల్‌కతా, పూణే, థానేలలో ఇళ్ల ధరలు 10-30% మధ్య పెరిగాయి. ఏడాది కాలంగా డిమాండ్, సరఫరా తగ్గినప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా భూమి, కార్మికులు, నిర్మాణ సామగ్రితో సహా ఇన్‌పుట్ ఖర్చు పెరుగుదల ఇళ్ల ధరలను స్థిరీకరించడానికి దారితీసింది. అయితే ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి” అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ జసుజా అన్నారు.

This website uses cookies.