2026 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోపు.. కేబీఆర్ పార్క్ జంక్షన్ల అభివృద్ది
రైజింగ్ హైదరాబాద్ స్కీమ్ కింద రూ.1,090 కోట్ల నిధులు
6 జంక్షన్లలో 6 అండర్ పాస్ లు- 120 అడుగుల వెడల్పుతో రోడ్లు
వారం రోజుల్లో కేబీఆర్ పార్క్ ప్రాజెక్టుకు టెండర్లు
హైదరాబాద్ లో మౌలిక వసతుల అభివృద్దిపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష్య కార్యాచరణలోకి దిగింది. రైజింగ్ హైదరాబాద్ స్కీమ్ లో భాగంగా సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ పేరుతో సిటీలో 38 పనులను 7 ప్యాకేజీల్లో చేయాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందులో మొదటి ప్యాకేజీ కింద కేబీఆర్ పార్కు చుట్టూ 6 అండర్ పాస్ లు, 8 ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. మొదట రూ.826 కోట్లతో నిర్మించాలని అనుకున్నప్పటికీ ఫ్లైఓవర్లు మొత్తం స్టీల్ తో నిర్మించాలని నిర్ణయించడంతో ఇప్పుడు అంచనా వ్యయం రూ.1,090 కోట్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం రైజింగ్ హైదరాబాద్ స్కీమ్ కింద విడుదల చేయనుంది. ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇవ్వడంతో.. పనుల ప్రక్రియలో జీహెచ్ఎంసీ అధికారులు వేగం పెంచారు. వారం రోజుల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలవనుండగా.. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు స్టార్ట్ చేయనున్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక పక్క నుంచి మరో పక్కకు ట్రాఫిక్ సమస్య లేకుండా 8 చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మిస్తారు. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నెంబర్ 45, ఫిలింనగర్, మహారాజ్ అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్లు ఉన్నాయి. ఇందులో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ల వద్ద రెండు చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగిలిన నాలుగు జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒకదానిపై మరో ఫ్లైఓవర్ నిర్మిస్తారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పై భాగంలో 2 లేన్లలో ఉంటుంది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్ 36 వైపు వెళ్లే 4 లేన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లేలా ప్లాన్ సిద్దం చేశారు.
జంక్షన్ల అభివృద్ధి పనుల్లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ భారీ స్థాయిలో రోడ్ల విస్తరణ జీహెచ్ఎంసీ చేపట్టనున్నది. తెలుగు దేశం పార్టీ ఆఫీసు ఉన్న రోడ్డు మొదలు చుట్టూ ఉన్న రోడ్లన్నింటినీ విస్తరిస్తారు. ప్రస్తుతం 100 అడుగుల మేర ఉన్న రోడ్లను 120 అడుగులకు పెంచుతారు. కింది భాగంలో అండర్ పాస్ లు, పైన స్టీల్ బ్రిడ్జిలతో పాటు 120 ఫీట్ల రోడ్డు వస్తుండటంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఎక్కడా ట్రాఫిక్ సమస్యకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.
కేబీఆర్ చుట్టూ రోడ్లను వెడల్పు కోసం 87 ఆస్తుల్ని సేకరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మాజీ మంత్రి జానారెడ్డి, సినీ హీరో- టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలో ఓ దఫా అధికారులు మార్కింగ్ చేశారు. టెండర్లు పూర్తి కాగానే పనులు మొదలవుతాయి.
కేబీఆర్ పార్కుతో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12ను విస్తరిస్తారు. 100 అడుగుల రోడ్డును 120 అడుగులకు పెంచుతారు. బాలాజీ టెంపుల్ జంక్షన్ తోపాటు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.150 కోట్లను కేటాయించింది. ఈ పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. వీటికి సంబంధించి అడ్డంకులన్నీ తొలగినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు అండర్ పాసులు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. అయితే కేబీఆర్ పార్క్ పచ్చదనానికి ఎటువంటి ప్రభావం పడకుండా పనులు చేస్తామని, ఒకవేళ చెట్లు తొలగించాల్సి వస్తే వాటిని వేరేచోట ట్రాన్స్ ప్లాంట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ పదవీ కాలం 2026 ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. దీంతో 2026 ఫిబ్రవరిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వ భావిస్తోంది. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే లోపు కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ది, అండర్ పాసులు-ఫ్లైఓవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.