Categories: TOP STORIES

హైదరాబాద్‌లో కొత్త‌గా 25 స్టార్ హోట‌ళ్లు..!

  • వ‌చ్చే రెండేళ్లలో ప‌లు హోట‌ళ్లు ఆరంభం..
  • 2032 నాటికి కొత్త‌గా 5,420 గ‌దులు..

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, 9030034591) జాతీయ‌, అంత‌ర్జాతీయ హోట‌ళ్ల‌కు హైద‌రాబాద్ వేదిక‌గా మారుతోంది. శంషాబాద్‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, హైటెక్ సిటీ, కొండాపూర్‌, శామీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో.. హిల్ట‌న్‌, జేడ‌బ్యూ మ్యారియెట్‌,  రిట్జ్ కార్ల్‌ట‌న్‌, డ‌బ్య్లూ, హ‌య‌త్ ప్యాలెస్‌, ఒబెరాయ్ వంటివి నిర్మాణం జ‌రుపుకుంటున్నాయి. అంతా స‌వ్యంగా సాగితే.. వీటిలో కొన్ని ఈ ఏడాది.. మ‌రికొన్ని వ‌చ్చే ఏడాది.. ఆత‌ర్వాత 2029, 2030, 2032 సంవ‌త్స‌రం నాటికి పూర్త‌వుతాయి. మ‌రి, ఏయే ప్రాంతాల్లో కొత్త‌గా స్టార్ హోట‌ళ్ల నిర్మాణం జ‌రుగుతున్నాయి? వాటిని నిర్మించే సంస్థ‌లేవి? ఒక్కో హోట‌ల్‌లో ఎన్ని గ‌దులుంటాయి?

హైద‌రాబాద్ క్ర‌మ‌క్ర‌మంగా అంత‌ర్జాతీయ న‌గ‌రంగా ఎదుగుతోంది. గ‌తంలో ఇవాంక ట్రంప్ ప‌ర్య‌ట‌న‌, తాజాగా మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు కార‌ణంగా భాగ్య‌న‌గ‌ర ఖ్యాతి ప్ర‌పంచ‌వ్యాప్త‌మ‌వుతోంది. ఇక్క‌డ పెట్టుబ‌డులు పెడితే ఆశించిన దానికంటే మెరుగైన రాబ‌డి వ‌స్తుంద‌ని ప్ర‌పంచ సంస్థ‌ల‌కు అర్థ‌మైంది. అందుకే, అధిక శాతం జీసీసీలు న‌గ‌రంలోకి అడుగుపెడుతున్నాయి. వ్యాపార స‌ద‌స్సులు, వాణిజ్య ఉత్స‌వాలు, ల‌గ్జ‌రీ టూరిజం వంటి అంశాల కార‌ణంగా హైద‌రాబాద్ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ క్ర‌మంలో దేశ‌, విదేశీ ప‌ర్యాట‌కులతో పాటు వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు, బ‌డా సంస్థ‌ల ప్ర‌తినిధుల్ని ఆక‌ట్టుకునేందుకు హైద‌రాబాద్‌లో కొత్తగా స్టార్ హోట‌ళ్ల నిర్మాణం ఊపందుకుంది.

ప్ర‌పంచ‌లోనే పేరెన్నిక గ‌ల హోట‌ల్ బ్రాండ్లు.. కొత్త‌గా స్టార్ హోట‌ళ్ల‌ను నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నాయి. వీటిలో కొన్ని ఇప్ప‌టికే నిర్మాణ ప‌నుల్ని ఆరంభించ‌గా.. మ‌రికొన్ని ప్ర‌ణాళిక ద‌శ‌లో ఉన్నాయి.  రియ‌ల్ ఎస్టేట్ గురుకి అందిన వివ‌రాల ప్ర‌కారం.. హైద‌రాబాద్లో కొత్త‌గా సుమారు పాతిక స్టార్ హోట‌ళ్లు ఏర్పాటు కానున్నాయి.  కోకాపేట్ నియోపోలిస్‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, బుద్వేల్‌, శంషాబాద్‌, ఎయిర్‌పోర్ట్‌, హైటెక్ సిటీ, గ‌చ్చిబౌలి, కొండాపూర్‌, డౌన్‌టౌన్‌, శామీర్‌పేట్‌, తుర్క‌ప‌ల్లి, మోమిన్‌పేట్‌, మొయినాబాద్ వంటి ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న‌య‌ని తెలిసింది.

నియోపోలిస్‌లో..
కోకాపేట్‌లోని నియోపోలిస్ Neopolis Kokapet హైద‌రాబాద్‌లోనే హాట్ లొకేష‌న్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక్క‌డ బ్రిగ్రేడ్ గ్రూప్ ఇంట‌ర్ కాంటినెంటెల్ క‌మ‌ర్షియ‌ల్ అండ్ రెసిడెన్షియ‌ల్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 2030 నాటికి పూర్త‌య్యే ఈ హోట‌ల్‌లో 250 గ‌దులుంటాయ‌ని తెలిసింది.

ALSO READ: ఈ నెలాఖ‌రు లోపు.. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2050

ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో హిల్ట‌న్ హోట‌ల్ మ‌రియు క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వ‌స్తుంద‌ని.. ఇందులో 330 గ‌దులతో పాటు అర‌వై వేల మందికి స‌రిప‌డే క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను నిర్మిస్తార‌ని స‌మాచారం. లాన్స‌మ్ డెవ‌ల‌ప‌ర్స్ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో ర్యాడిస‌న్ క‌లెక్ష‌న్ హోట‌ల్‌ను నిర్మిస్తున్న‌ట్లు తెలిసింది. ఇందులో మూడు వంద‌ల గ‌దులుంటాయ‌ని.. 2029 నాటికి పూర్త‌వుతుందని స‌మాచారం. ఐటీసీ వెల్‌క‌మ్ హోట‌ల్‌ను శంక‌ర్‌ప‌ల్లిలోని పామ్ ఎగ్జాటికాలో డెవ‌ల‌ప్ చేస్తున్నార‌ని.. ఇందులో 150 గ‌దులుంటాయని తెలిసింది. ఎస్పీ రెడ్డి అనే డెవ‌ల‌ప‌ర్ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో మాక్సీ అనే హోట‌ల్‌ను నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించార‌ని.. 180 గ‌దుల ఈ హోట‌ల్ 2030 నాటికి ప్రారంభం అవుతుంది.

ఎయిర్‌పోర్టు స‌మీపంలో..
శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరువ‌లోని బుద్వేల్‌లో జేడ‌బ్య్లూ మారియ‌ట్ అండ్ రెసిడెన్సెస్‌ను JW Marriott and Residences పూజా క్రాఫ్ట్ అనే సంస్థ డిజైన్ చేసింది. ఇందులో 330 గ‌దులు, ముప్ప‌య్ వేలు బ్యాంకెట్ స్పేస్‌ను డెవ‌ల‌ప్ చేసింది. ఇందులో 2030 నాటికి పూర్త‌వుతుంది. రిట్జ్ కార్ల‌ట‌న్ రిసార్ట్ అండ్ బ్రాండెడ్ విల్లా ప్రాజెక్టును శంషాబాద్లో 200 గ‌దుల హోట‌ల్‌ను నిర్మిస్తోంది. ఎయిర్‌పోర్టులో తాజ్ వివాంతా ప్రాజెక్టును జీఎమ్మార్ నిర్మిస్తోంది. ఇందులో 225 గ‌దులొస్తాయి. 2030 నాటికి పూర్త‌వుతుంద‌న్నారు. శంషాబాద్‌లో రిట్జ్ కార్ల్టన్ రిసార్ట్ & బ్రాండెడ్ విల్లా 200 గ‌దులు, విమానాశ్ర‌యం చేరువ‌లో గ్రాండ్ హయత్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, శ్రీశైలం క్రాస్ రోడ్డులో హాలిడే ఇన్ వంటి హోట‌ళ్లు 2030లోపు ఆరంభ‌మ‌వుతాయి. ప్రెస్టీజ్ సంస్థ శంషాబాద్‌లో జేడ‌బ్ల్యూ మారియ‌ట్ హోట‌ల్‌ను నిర్మిస్తుంద‌ని స‌మాచారం.

మాదాపూర్‌లో కొత్త‌గా..
హైటెక్ సిటీలో సాల‌ర్‌పూరియా సత్వా 200 గ‌దులుండే సెయింట్ రెగీస్ హోటల్ ను డిజైన్ చేసింది. ఇందులో సుమారు 200 గ‌దులొస్తాయి. అదే ప్రాంతంలో చాలెట్ హోట‌ల్స్ నిర్మిస్తున్న రిట్జ్ కార్ల్‌ట‌న్ హోట‌ల్లో 200 గ‌దులు, ప్రెస్టీజ్ ఒబెరాయ్ హోట‌ల్‌లో 220 గ‌దులుంటాయి. ఇవ‌న్నీ 2032లో ఆరంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. హైద‌రాబాద్‌లో పేరెన్నిక డెవ‌ల‌ప‌ర్ అయిన ఎస్పీ రెడ్డి హైటెక్ సిటీలో 280 గ‌దుల రెనియన్నస్ హోట‌ల్ నిర్మిస్తున్నారు. ష‌మీ హోట‌ల్స్ రాంకీ ట‌వ‌ర్స్ చేరువ‌లో డ‌బ్ల్యూ హోట‌ల్‌, ఆర్ ఆర్ కార్ప్ కొండాపూర్‌లో హ‌య‌త్ ప్యాలెస్‌, డీఎస్సార్ సంస్థ డౌన్‌టౌన్‌లో వెల్‌కం హోట‌ల్ వంటివి త్వ‌ర‌లో పూర్త‌వుతాయ‌ని స‌మాచారం.

శామీర్‌పేట్‌లో గేట్వే లేదా ర్యాడిస‌న్ క‌లెక్ష‌న్ హోట‌ల్‌ను ఆర్ఆర్ కార్ప్ అనే సంస్థ నిర్మిస్తోంది. ఇందులో 125 గ‌దులొస్తాయి. తుర్క‌ప‌ల్లిలో 115 గ‌దుల హిల్ట‌న్ హోట‌ల్‌, శామీర్‌పేట్‌లో గేట్‌వే లేదా ఎపిక్ క‌లెక్ష‌న్ హోట‌ల్ 2026లో ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం.

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, 9030034591)

This website uses cookies.