HMDA Master Plan
హైదరాబాద్ మహానగర విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. రాబోవు 25 ఏళ్లు హైదరాబాద్ సిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్-2050 ను హెచ్ఎండీఏ రూపొందించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఈ నెలాఖరుకల్లా విడుదల చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది.
డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ విడుదల తరువాత ఆయా జిల్లాలు, మండల స్థాయి నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుంది ప్రభుత్వం. ఈ ప్రక్రియ మొత్తం సుమారు మూడు నెలల పాటు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ ముసాయిదా మాస్టర్ ప్లాన్-2035 లో మార్పులు, చేర్పులను పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ సంవత్సరం 2025 నవంబర్ నుంచి కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చే అవకాశముందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఐదు మాస్టర్ ప్లాన్లు అమల్లో ఉన్నాయి. పాత మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ, ఎయిర్ పోర్టు అథారిటీ, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, విస్తరిత ప్రాంతాల అభివృద్ధి ప్లాన్ -2023 ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి ఒక ప్రాంతం రెండు మాస్టర్ ప్లాన్ ల పరిధిలోకి వస్తుండడంతో అనేక రకాల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2030 మాస్టర్ ప్లాన్‌లో తప్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో అభివృద్ధి అనుకున్నంత మేర ముందుకు సాగడం లేదని అధికారులు గుర్తించారు.
ఎన్వోసీల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకే ఈ సారి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ లో పాలనా పరమైన అంశాలతో పాటు ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటుంది హెచ్ఎండీఏ. గూగుల్ మ్యాపులు, స్థానిక రెవెన్యూ మ్యాపులు, గ్రామాల మ్యాపులు, ఎన్జీఆర్ఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ను తీసుకొని కొత్త సాంకేతిక విధానంతో తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తోంది రేవంత్ సర్కార్. ఇక నుంచి ఒకటే మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఆయా స్థానిక సంస్థలు, ఇతర అథారిటీలు తమ ప్రణాళికలు రూపకల్పన చేయనున్నాయి.
ALSO READ: సెంట్రల్లో స్కై స్క్రేపర్లు
హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ విస్తరిత ప్రాంతంలో 2050 వరకు ఎలాంటి సౌకర్యాలుండాలి, రహదారుల అనుసంధానం నుంచి రెసిడెన్షియల్ జోన్లు, పారిశ్రామిక జోన్లు, అర్బన్ జోన్లు, గ్రీన్ జోన్లు, గ్రిడ్ రోడ్లు ఎక్కడెక్కడ ఎంతెంత ఉండాలన్న విషయం పొందుపరుస్తున్నారు. గతంలో ఏడు జిల్లాల పరిధిలో 2008లో మహానగర విస్తరిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని 2030 అవసరాల కోసం మాస్టర్‌ప్లాన్ ను హెచ్ఎండీఏ రూపకల్పన చేసింది. అప్పట్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదని క్రమ క్రమంగా తలెత్తుతున్న సమస్యలను బట్టి గుర్తించింది ప్రభుత్వం. అందుకే హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందనే కోణంలో ఆలోచించి కొత్త మాస్టర్ ప్లాన్ కు పూనుకుంది తెలంగాణ సర్కార్. నూతన మాస్టర్ ప్లాన్ లో భాగంగా అన్ని రకాల జోన్ల పరిధితో పాటు.. ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లను పది వరకు పెంచడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేస్తోంది హెచ్ఎండీఏ.
హైదరాబాద్ మహానగర్ ప్రణాళిక -2030 లో ఏడు జిల్లాల పరిధి మాత్రమే ఉండగా.. కొత్త మాస్టర్ ప్లాన్ 2050లో ప్రాంతీయ రింగు రోడ్డు దాటి విస్తరిస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2050లో కొత్తగా 4 జిల్లాలు, 32 మండలాలు హెచ్ఎండీఏలో చేరనున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేటతో పాటు కొత్తగా నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ పలు మండలాలను చేర్చనున్నారు. ప్రస్తుతం 74 మండలాలు ఉండగా వాటి సంఖ్య వంద దాటనుందని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ విస్తీర్ణం ప్రస్తుతం 7,257 చదరపు కిలో మీటర్లు ఉండగా.. దాదాపు 13 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది.
హెచ్ఎండీఏ 2050 మాస్టర్ ప్లాన్ లో ప్రజారవాణా, నీటివనరులు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్లు, అంతర్గత రహదారుల అభివృద్ధి, మెట్రో సేవల విస్తరణకు ప్రాధాన్యం కల్పిస్తారు. జాతీయ రహదారులు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తో అనుసంధానం, జనాభాకు అనుగుణంగా ప్రజారవాణాను పటిష్ఠం చేసేందుకు మొబిలిటీ ప్లాన్‌లో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. పారిశ్రామిక కారిడార్లు, వర్క్ ఫోర్స్, కొత్త పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక వసతులు.. ఇలా ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావాల్సిన అన్ని అంశాలను మాస్టర్ ప్లాన్ 2050 లో పొందుపరుస్తారు. వచ్చే 25 ఏళ్లకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 3600 చెరువులు ఆక్రమణలకు గురికాకుండా బ్లూ అండ్ గ్రీన్ పేరుతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు అధికారులు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2050 ఈ నెలాఖరు కల్లా విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
This website uses cookies.