- అధికారులు చేసింది తప్పు
- శిక్ష అనుభవిస్తుంది రైతులు
- ఆ భూమిని కొన్న డెవలపర్లు
- అన్నీఇన్నీ కాదు.. ధరణి సమస్యలు!
- కోట్లు పెట్టి కొన్నాక కోటీ కష్టాలు
కొల్లూరులో రామయ్య అనే రైతుకు తాతల నాటి నుంచి సంక్రమించిన 20 ఎకరాల స్థలం ఉంది. ఆయన మధ్యలో 10 ఎకరాల స్థలాన్ని శ్రీలత అనే మహిళలకు విక్రయించారు. శ్రీలతకు పాస్ పుస్తకం కూడా జారీ అయ్యింది. కానీ, ధరణిలో ఆమె పేరు లేదు. దీంతో, పాస్ పుస్తకం ఆధారంగా స్థలం కొన్న డెవలపర్లు.. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
వరదలు.. భూకంపం.. వంటి వైపరీత్యాలు ఏర్పడటానికి మనుష్యుల ప్రమేయం ఉండదు. కరోనా కూడా ఎక్కడో తయారై ఇక్కడికొచ్చింది. కానీ, ధరణి సమస్యను మనం సృష్టించిందే. దీని వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కోట్లు పెట్టి భూమిని కొన్న తర్వాత కూడా ప్రభుత్వం చేసిన తప్పు వల్ల రైతులతో పాటు డెవలపర్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఒక సర్వే నెంబరులో ఒకట్రెండు గుంటల స్థలానికి సంబంధించి కోర్టు కేసు ఉంటే.. ఆయా సర్వే నెంబరును మొత్తం కోర్టు కేసులో ఉందని పెట్టేస్తున్నారు. ఫలితంగా, డెవలపర్లు అటు రెవెన్యూ అధికారులు, ఇటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.
భూమికి సంబంధించిన రికార్డులన్నీ పక్కాగా పెట్టి.. జాయింట్ కలెక్టర్లకు మొర పెట్టుకున్నా.. అదనపు కలెక్టర్లకు విన్నవించుకున్నా ఫలితం ఉండట్లేదు. ఇందులో స్థానిక రాజకీయ నాయకులూ చేరడం వల్లే అసలు సమస్యలు ఏర్పడుతున్నాయని ఆరోపించేవారు లేకపోలేరు.
శివార్లలో విల్లా ప్రాజెక్టుల్ని ఆరంభించాలని అనేక మంది డెవలపర్లు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే, అడుగు ముందుకు వేయడానికి ధరణి అడ్డు పడుతోంది. పాస్ పుస్తకాలు సకాలంలో రాకపోవడంతో.. స్థల యజమానులతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కూడా చేసుకోలేకపోతున్నారు. మరి, ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ముఖ్యంగా, సీఎస్ సోమేష్ కుమార్ తలుచుకుంటే ధరణి సమస్యలు చిటికెలో పరిష్కారం అవుతాయని అధిక శాతం మంది డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. ధరణిలో ఎలాంటి సమస్య ఉన్నా.. పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టాలి. అలా చేస్తేనే కొన్ని సమస్యలకు సులువుగా పరిష్కారం లభిస్తుంది.