Categories: Uncategorized

నోటీసులివ్వడానికి పోలీసులు వస్తే.. పక్కింట్లో దాక్కున్న బిల్డర్

చీటింగ్ కేసులు నోటీసుల ఇవ్వడానికి వచ్చిన పోలీసులకు ఓ బిల్డర్ చుక్కలు చూపించాడు. పక్క ఫ్లాట్ లో దాక్కుని బయటకు రాలేదు. చివరకు పోలీసులు తాళాలు తయారు చేసే వ్యక్తిని పిలిపించి ఆ ఫ్లాట్ తలుపులు తెరిపించాల్సి వచ్చింది. తనను రూ.11.76 కోట్ల మేర చీటింగ్ చేశారంటూ ముంబైకు చెందిన ఆర్బిట్ వెంచర్స్ డెవలపర్స్ డైరెక్టర్ ధ్రువ్ (55), మరో ముగ్గురిపై 57 ఏళ్ల మహిళ చేసిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదైంది.

ముంబై ఆర్థిక నేరాల విభాగం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా పోలీసు బృందం ధ్రువ్ ఇంటికి వచ్చింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ధ్రువ్ పక్క ఫ్లాట్ లో దాక్కున్నాడు. పోలీసులు ఎంతగా తలుపు కొట్టినా తీయలేదు. రెండు గంటలపాటు వేచి చూసిన పోలీసులు చివరకు స్థానికంగా ఉన్న తాళాలు తయారుచేసే వ్యక్తిని పిలిపించి ఆ తలుపులు తెరిపించాల్సి వచ్చింది. అప్పుడు బయటకు వచ్చిన ధ్రువ్ కు నోటీసులు అందజేసి విచారణ నిమిత్తం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.

వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఖార్ కు చెందిన మహిళ నుంచి అతడు రూ.11.76కోట్లు అప్పుగా తీసుకున్నాడని.. అయితే, ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదని సదరు మహిళ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. డబ్బుకు బదులు తను నిర్మిస్తున్న కమర్షియల్ ప్రాజెక్టులో ఓ యూనిట్ ఇస్తానని హామీ ఇచ్చి అలాట్ మెంట్ లెటర్ కూడా ఇచ్చాడని, అయినా ఆ యూనిట్ కూడా ఇవ్వకుండా మోసం చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారని వెల్లడించారు.

This website uses cookies.