Categories: TOP STORIES

దొంగల ముఠా.. కష్టార్జితం దోచేస్తారు జాగ్రత్త!

  • అసలీ బిల్డర్ కి నిర్మాణ వ్యయం ఎంత అవుతుందో తెలుసా?

ఈవీకే అనే సంస్థ కొల్లూరులో ఆవాసా అనే హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తోంది. ఇందులో రెండు మరియు మూడు పడక గదుల ఫ్లాట్లను చదరపు అడుక్కీ కేవలం రూ.3,499కే విక్రయిస్తోంది. సాధారణ ధర రూ.4,500 అయితే.. చదరపు అడుక్కీ వెయ్యి రూపాయలు తక్కువకే అమ్ముతోందని ప్రచారం చేస్తోంది. అసలీ బిల్డర్ కి నిర్మాణ వ్యయం ఎంత అవుతుందో తెలుసా? ఇప్పటివరకూ ఎన్ని నిర్మాణాలు నిర్మించిన చరిత్ర ఉందీ సారుకి? ప్లాట్లు అమ్మినంత సులభం అనుకుంటున్నాడా అపార్టుమెంట్లు కట్టడం! ఒక గేటెడ్ కమ్యూనిటీని పునాదుల దశ నుంచి కొనుగోలుదారులకు అందించేంత వరకూ ఎంత శ్రమించాలి? ఎన్ని కష్టాలు పడాలి? ఎంత మందిని కోఆర్డినేట్ చేయాలి? ఎన్ని నిబంధనల్ని పాటించాలి? ఎంత టెన్షన్ పడాలి? గేటెడ్ కమ్యూనిటీని కట్టడమంటే బ్రోచర్ డిజైన్ చేసినంత సులువని అనుకుంటున్నాడా ఈ బిల్డర్? పైగా, ఈ మధ్యకాలంలో రెరా అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు కొందరు రియల్టర్లు చెలరేగిపోతున్నారు. వీరిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కొనుగోలుదారులు అంటున్నారు.

ఈవీకే ఆవాసా బ్రోచర్ ని గమనిస్తే సుమారు పద్దెనిమిది అంతస్తుల అపార్టుమెంట్ని కట్టేందుకు ప్రణాళికలు రచించారని అర్థమవుతోంది. పైగా, రూఫ్ టాప్ డ్యూప్లే విల్లాలు విత్ స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తారట. ప్రస్తుతం పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల్ని పరిగణనలోకి తీసుకుంటే.. 18 అంతస్తుల అపార్టుమెంట్ని కట్టేందుకు ఎంత ఖర్చొస్తుందో ఈ బిల్డర్ కి తెలుసా? పైగా, రూఫ్ టాప్ డ్యూప్లే విల్లాలతో పాటు స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తారటా? ఇలాంటి కట్టడం పూర్తి చేయాలంటే ఎంత సాంకేతిక నైపుణ్యం ఉండాలో తెలుసా? అనుభవమున్న బిల్డర్లే ఈ తరహా ప్రయోగం చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.

బ్రోచర్ ని గమనిస్తే.. హెచ్ఎండీఏ అనుమతి తీసుకోలేదు. రెరా అప్రూవల్ కూడా లేదు. కాబట్టి, ఇది కచ్చితంగా దొంగలముఠా ప్రాజెక్టే అని కొనుగోలుదారులు భావిస్తున్నారు. అందుకే, ఈ ప్రాజెక్టులో కొనాలా? వద్దా? అని రియల్ ఎస్టేట్ గురుని సంప్రదించారు. స్థానిక సంస్థల అనుమతి లేదు కాబట్టి, ఈ ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితిలో ఫ్లాట్ కొనకూడదు. రేటు తక్కువకు వచ్చిందని ఎగబడి కొనుగోలు చేయకుండా.. అసలు ఈ డెవలపర్ ప్రాజెక్టును ఆరంభించి నాణ్యతతో కట్టిస్తాడా? అనే విషయాన్ని ఆలోచించండి.

లేఅవుట్లు డెవలప్ చేసినంత సులువుగా అపార్టుమెంట్లను నిర్మించలేమనే విషయాన్ని ప్రతిఒక్క కొనుగోలుదారుడు అర్థం చేసుకోవాలి. కేవలం నిపుణులైన డెవలపర్లు కట్టే ప్రాజెక్టుల్లో మాత్రమే ఫ్లాట్లను కొనుగోలు చేసి.. స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం అన్నివిధాల ఉత్తమం. కాబట్టి, ఇలాంటి దొంగల ముఠా వంటి రియల్టర్ల మాటల్ని నమ్మేసి మీ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసుకోవద్దు. రెరా అనుమతి తీసుకోకుండా ఇలా బ్రోచర్లను వాట్సప్పుల్లో పంపిస్తూ ఫ్లాట్లను విక్రయిస్తున్న ఈ సంస్థపై తక్షణమే రెరా ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను విధించాలి.

This website uses cookies.