- వ్యవసాయ క్షేత్రాల్లో రియల్టర్ల వ్యాపారం
- ల్యాండ్ కన్వర్షన్ లేదు.. అనుమతి లేదు
- గుంటల్లో స్థలం అమ్మకాలు.. రిజిస్ట్రేషన్ కూడా
- రోడ్ ప్యాటర్న్ ఉంటే మున్సిపల్ పరిధిలోకి తేవాలి
కింగ్ జాన్సన్ కొయ్యడ: సెలబ్రిటీలు.. బడా వీఐపీలు.. రాజకీయ ప్రముఖులు.. తీరికవేళలో సేదతీరేందుకు ఫామ్ హౌజులకు వెళుతుంటారు. కొందరికేమో వ్యవసాయ క్షేత్రాలూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇవి హైదరాబాద్‌లోని మొయినాబాద్, గండిపేట్, శంషాబాద్, చేవేళ్ల, శంకర్ పల్లి, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటికి ల్యాండ్ కన్వర్షన్ ఉండదు. బీటీ రోడ్లు కూడా వేయరు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ తరహా పోకడ నుంచి స్ఫూర్తి పొందారో ఏమో తెలియదు కానీ కొందరు రియల్టర్లు ఫామ్ హౌజ్ కాన్సెప్టుకు కొత్త రూపమిచ్చి.. ఫామ్ లేఅవుట్ల కాన్సెప్టును మార్కెట్లో పరిచయం చేశారు.
ఈ ఫామ్ లేఅవుట్ల ప్రత్యేకత ఏమిటంటే.. వీటిని గుంటల్లో అమాయకులకు అంటగట్టేస్తున్నారు. గుంటకు లక్ష నుంచి పది లక్షల చొప్పున అమ్ముతున్నారు. కొందరైతే ఐదు, పది గుంటల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. పేరుకేమో ఇది ఫామ్ లేఅవుట్ అయినప్పటికీ, వెంచర్ తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. అందులో 30, 40 అడుగుల రోడ్లను డెవలప్ చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఫామ్ ప్లాట్ల పేరిట భూముల్ని అమ్ముతున్నా.. వాటిని గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నా.. ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఇక్కడ రైతులు, రియల్టర్లు లాభపడుతున్నారే తప్ప ఇలాంటి లావాదేవీల వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పెద్ద గుండు సున్నా. మహా అయితే గుంటల్లో కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారంతే. అందులోనూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నామమాత్రమే.
నిబంధనల్ని మార్చాలి
వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ హౌజులుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, అందులో బీటీ రోడ్లను అభివృద్ధి చేస్తే గనక వాటిని లేఅవుట్లుగానే పరిగణించాలి. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం.. వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌజ్‌లు ఎవరికైనా వ్యక్తిగతంగా ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే, అందులో రోడ్డు ప్యాటర్న్ అభివృద్ధి చేస్తే తప్పకుండా లేఅవుట్ అనుమతి తీసుకోవాల్సిందే. ఫామ్ ప్లాట్లను మున్సిపల్ పరిధిలోకి తేవాలి. వాటిని ఎవరు అభివృద్ధి చేస్తున్నా అనుమతి తీసుకునేలా నిబంధనల్ని పొందుపర్చాలి. అప్పుడే అవి రెరా పరిధిలోకి వస్తాయి.