ఇప్పటికే యూడీఎస్ స్కీమ్, ప్రీలాంచ్ ఆఫర్లతో కొందరు అక్రమార్కులు సామాన్య, మధ్యతరగతి వేతనజీవులతో ఆటాడుకుంటున్నారు. వారి సొమ్మును అప్పనంగా దోచేసుకుంటున్నారు. ఇవి చాలవన్నట్లు.. హైదరాబాద్ రియల్ రంగంలో ఫామ్ ప్లాట్స్ మోసం బయటికొచ్చింది. హెచ్ఎండీఏ, డీటీసీపీ, స్థానిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అనుమతుల్ని తీసుకోకుండా పలువురు రియల్టర్లు ఈ దందాను నిర్భయంగా జరుపుతున్నారు. కొందరు పంచాయతీల పాతతేదీలు వేసి ఈ దందాను నడిపిస్తుంటే.. మరికొందరేమో ఎలాంటి అనుమతి లేకుండానే ఇబ్బడిముబ్బడిగా అమ్మేస్తున్నారు. కేవలం చిన్న రియల్టర్లే కాదు.. బడా బడా కంపెనీలూ ఇలాంటి అక్రమ లావాదేవీలను జరుపుతున్నాయని రియల్ ఎస్టేట్ గురు చేసిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరు రియల్టర్లు ఏం చేస్తున్నారంటే.. స్థానిక సంస్థలు కానీ రెరా నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా లేఅవుట్ మ్యాపును తయారు చేసి ఫామ్ ప్లాట్లను అమ్మేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత నుంచి కొత్తగా రీజినల్ రింగ్ రోడ్డు వచ్చే ప్రాంతాలకు చేరువగా, వాటికి కాస్త అటూఇటూగా ఈ ఫామ్ ప్లాట్ల దందా ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగింది. ప్రధానంగా, ఆర్ ఆర్ ఆర్ ప్రకటన వెలువడిన తర్వాత ఈ తరహా మోసాలకు హైదరాబాద్ కేంద్రబిందువుగా మారింది. ఈ తతంగంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం కూడా ఉందని డెవలపర్లు అంటున్నారు. ప్రతి ప్రాంతంలో వారికి తెలియకుండా ఈ మోసం జరిగే అవకాశమే లేదని చెబుతున్నారు.
ఆకర్షణీయమైన ధర
కొందరు రియల్టర్లు ఏం చేస్తున్నారంటే లక్షన్నర లేదా రెండు లక్షలకే ఫామ్ ప్లాట్ అంటూ అమాయకుల్ని బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా, ఓ ఐదు నుంచి పదేళ్ల తర్వాతనైనా ఆయా ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ నమ్మిస్తున్నారు. ఎవరూ మళ్లీ కొనకపోతే తామే తిరిగి కొంటామంటూ మరికొందరు హామీ ఇస్తున్నారు. చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు తమకొక ప్లాటు ఉంటుంది కదా అంటూ వెనకా ముందు చూసుకోకుండా కొనేస్తున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకున్న తర్వాతే అందులో స్థలం లేదా ఇల్లు కట్టుకోవచ్చు. ఇందుకోసం ల్యాండ్ యూజ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే, కొందరు రియల్టర్లు చేస్తున్న ఫామ్ ప్లాట్స్ వెంచర్లలో ఎలాంటి కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూమిని నేరుగా విక్రయిస్తున్నారు. ఆ తర్వాత కొన్నవారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
నిషేధిత భూముల్ని సైతం..
ఫామ్ ప్లాట్ల పేరిట కొందరు అక్రమార్కులు నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని సైతం అమ్మేస్తున్నారు. 111 జీవో ప్రాంతాల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. చెరువులు, కుంటల్ని కూడా వదలడం లేదు. ఎనిమిది కంటే ఎక్కువ మందికి విక్రయిస్తున్నారు కాబట్టి, తప్పనిసరిగా రెరా అనుమతి వీటికి ఉండాల్సిందే. కానీ, వీరేమాత్రం పట్టించుకోవడం లేదు. అధిక శాతం తెలంగాణ రాష్ట్రమంతా డీటీసీపీ పరిధిలోకి వస్తుంది. అయినా పావు ఎకరం నుంచి ఎకరం చొప్పున అమ్ముతున్నారు.
సదాశివపేట్‌లో ఎకరం రూ.54 లక్షలు?
వామ్మో.. సదాశివపేట్‌లో ఎకరం రూ.54 లక్షలా? అంతంత దూరంలో ఇంత రేటు పెట్టి విక్రయిస్తున్నారు కొందరు రియల్టర్లు, పైగా, వీరు ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు రూ.54 లక్షలకు ఎకరా చొప్పున కొంటే, పదిహేను నెలల తర్వాత దాదాపు కోటి రూపాయలకు వాళ్లే కొనుక్కుంటారట. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. మొత్తం 12000 ఎకరాలు మెయిన్ రోడ్డు మీద ఉందట.. మొత్తం ఫినీక్స్ అనే గ్రూప్ ఈ స్థలాన్ని అభివృద్ధి చేస్తుందని వాట్సప్పుల్లో కొనుగోలుదారులకు కొందరు రియల్టర్లు మెసేజ్ చేస్తున్నారు. గోల్ఫ్ కోర్సు, లాజిస్టిక్స్, స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేసెస్ వంటివి ఫినీక్స్ అనే గ్రూప్ అభివృద్ధి చేస్తుందని సమాచారం పంపిస్తున్నారు. మరి, ఇందులో వాస్తవమెంత ఉందనే విషయాన్ని తెలంగాణ రెరా అథారిటీ పరిశీలిస్తోంది. ఇప్పటికే ప్రీ లాంచ్ అమ్మకాల గురించి ఫినీక్స్ సంస్థ ప్రతినిధుల్ని రెరా అథారిటీ కొద్ది రోజుల క్రితం సంజాయిషీ కోరింది. అయితే, ఆ అమ్మకాలకు తమకెలాంటి సంబంధం లేదని ఫినీక్స్ గ్రూప్ ప్రతినిధులు తెలియజేసినట్లు సమాచారం.
ఎకరమిస్తే 1350 గజాలిస్తారట?
ఎకరాన్ని 55 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తే.. రైతుల నుంచి భూమిని నేరుగా కొనుగోలుదారుల పేరిట బదిలీ చేస్తారట. కాకపోతే, ఆ తర్వాత సదరు కొనుగోలుదారులు సప్లిమెంటరీ డెవలప్ అగ్రిమెంట్ శ్రీనిధి లేదా ఫినీక్స్ సంస్థకు రాసివ్వాలట. అలా రాసిచ్చిన తర్వాత, ఆ ఎకరం స్థలానికి గాను అట్టి టౌన్‌షిప్పులో 1350 గజాల ప్లాటును అందజేస్తారట. ఇక్కడ ఫినీక్స్ సంస్థ రైతుకు, పెట్టుబడిదారుడికి మధ్యలో సంధానకర్త (ఫెసిలిటేటర్) గా వ్యవహరిస్తుందట. అందుకే, బై బ్యాక్ మీద ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదట. కాకపోతే, కొందరు అక్రమార్కులు ఈ వెంచర్‌ని చూపెట్టి అమాయకుల సొమ్ము కొట్టేస్తున్నారు. మరి, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి అక్రమాలపై తెలంగాణ రెరా అథారిటీ ఇప్పటికైనా సీరియస్‌గా దృష్టి సారించాలి. తెలంగాణలో రియల్ రంగాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్న ఇలాంటి అక్రమార్కులపై సర్కారు కన్నెర్ర చేయాలి. ఎలాంటి పెద్దవాళ్లు అయినా వారిని శిక్షించాలన్నారు.
నగరం చుట్టూ మోసమే?
మహేశ్వరం, మెయినాబాద్, చేవేళ్ల, శంకర్ పల్లి, వికారాబాద్, సంగారెడ్డి, సదాశివపేట్, భువనగిరి, ఆలేరు, జనగాం, చౌటుప్పల్, యాచారం, కందుకూరు, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో ఈ ఫామ్ ప్లాట్ల స్కామ్ ఎక్కువగా జరుగుతోంది. డీటీసీపీ ప్రాంతీయ సంచాలకులు, రెరా సభ్య కార్యదర్శి ఒక్కరే కాబట్టి, ఈ అక్రమ ఫామ్ ప్లాట్ల గురించి సమాచారం తెప్పించుకోవాలి. అక్రమ రియల్టర్లకు శిక్షించి జరిమానా వేయాలి.