ఫామ్ ల్యాండ్.. ఒకప్పుడు ధనవంతులు, బాగా డబ్బులున్నవాళ్లకు మాత్రమే సొంతం. కానీ మారుతున్న పరిస్థితుల నేపధ్యంలో ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అందరికి అందుబాటులోకి వస్తోంది. ఎకరాల విస్థీర్ణంలోనే కాకుండా గజాల్లో కూడా ఫామ్ ల్యాండ్ దోరుకుతుండటంతో సామాన్య, మధ్యతరగతి వారు సైతం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఐతే ప్రభుత్వ అనుమతులు ఉన్న ఫామ్ ల్యాండ్ ను మాత్రమే కొనుగోలు చేయాలని రియాల్టీ నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడికి భరోసా ఉండటంతో పాటు, వృద్ధికి ఢోకా ఉండని ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్ కు ఇప్పుడు బాగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ వెంచర్స్ లో చాలా మార్పులు వచ్చాయి.
వారాంతాల్లో గడిపేందుకు అనువుగా ఉండి, పొలం పనుల ముచ్చట తీర్చుకోవాలన్న మధ్యతరగతివారికి అనుగునంగా మార్కెట్లోకి ఫామ్ ల్యాండ్ వెంచర్స్ వస్తున్నాయి. మధ్య తరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని సిటీకి కాస్త దూరంలో ఫామ్‌ల్యాండ్స్ వెలుస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ రాబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు బయట ఎక్కువగా ఈ తరహా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. శ్రీశైలం రహదారి, యాదాద్రి రోడ్డు, సాగర్ రోడ్డు, బెంగళూరు హైవేలో షాద్ నగర్, వికారాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా ఫామ్ ల్యాండ్ వెంచర్స్ వస్తున్నాయి.
ఫామ్ ల్యాండ్స్ లో ఉరుకులు పరుగులు లేకుండా ఆరోగ్యకర వాతావరణంలో నివసిస్తున్న అనుభూతి చెందుతుంటారు. దీంతో చాలా మంది వారాంతాల్లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారు. కొంతకాలంగా సిటీ చుట్టుపక్కల జిల్లాల్లో ఫ్యామ్‌ల్యాండ్ రిజిస్ట్రేషన్ల లావాదేవీలు పెరగడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని రియల్టర్లు ఫ్యామ్ ల్యాండ్స్‌లోనే భిన్నరకాలైన ప్రాజెక్టులను అభివృద్ది చేస్తున్నారు.
ఎకరం నుంచి మొదలు గజాల్లో సైతం ఫామ్ ల్యాండ్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి స్థలంలో పండ్ల మొక్కలు, దీర్ఘకాలంలో ఆదాయాన్నిచ్చే ఎర్రచందనం, శ్రీ గంధం, టేకు వంటి మొక్కలు పెంచుతున్నారు. కొన్ని సంస్థలు పూర్తి స్థాయిలో మొక్కలు పెంచుతుంటే, మరికొన్ని ప్రాజెక్టుల్లో ఫామ్ హౌజ్ కట్టుకునేందుకు, వీకెండ్ హోమ్స్ నిర్మించుకునేందుకు కొంత స్థలం వదిలి మొక్కలు నాటుతున్నారు. మరి కొన్ని రియాల్టీ సంస్థలు ఫామ్ ల్యాండ్ లో ప్రత్యేకంగా క్లబ్ హౌజ్‌లు, రిసార్ట్ లు నిర్మిస్తున్నాయి.
ఉద్యోగ, వృత్తి, వ్యాపార బాధ్యతల నుంచి రిటైర్ అయ్యాక, సిటీకి దూరంగా ప్రశాంత వాతావరణంలో నివసించొచ్చని ముందు చూపుతో కొందరు, పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం మరికొందరు ఫామ్ ల్యాండ్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, పదవీ విరమణకు చేరువలో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఫామ్ ల్యాండ్ కొంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా వ్యవసాయ పొలాలనే పావు ఎకరం మొదలు ఎకరం వరకు విక్రయిస్తుండగా, మరికొన్ని ప్రాజెక్టుల్లో గజాల చొప్పున అమ్ముతున్నారు. ప్రాంతం, ప్రాజెక్టును బట్టి ఒక గుంట అంటే 121 చదరపు గజాలు 8 వేల రూపాయల నుంచి 12 వేల రూపాయల వరకు ధరలున్నాయి.
డీటీసీపీ లేఆవుట్లలో అభివృద్ది చేసిన ఫామ్ ల్యాండ్ ఐతే చదరపు గజం 10 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు ధరలున్నాయి.ఐతే ఎకరం, అర ఎకరం, పావు ఎకరం కొనుగోలు విషయంలో సమస్య లేదు. కానీ గజాల చొప్పున ఫామ్ ల్యాండ్ కొనే సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. డీటీసీపీ నుంచి పర్మీషన్ పొందిన లేఅవుట్ లోనే ఫామ్ ల్యాండ్ కొనుగోలుచేయాలని అంటున్నారు. ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులో రోడ్లు, మౌళిక వసతుల అభివృద్ధిపై పూర్తి స్పష్టత తీసుకున్నాకే పెట్టుబడి పెట్టాలని ఈ రంగంలోని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.