హైదరాబాద్ వాసులకు త్వరలోనే మరో మూడు మార్గాల్లో మెట్రో రైల్ అందుబాటులోకి రాబోతోంది. మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానాకి ఇప్పటికే పచ్చ జెండా ఊపిన రేవంత్ సర్కార్.. మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లలో సర్వే పనుల్లో వేగం పెంచింది. ఈ నెలాఖరుకల్లా ఈ రూట్ లో ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు పూర్తవుతాయని హైదరాబాద్ మెట్రో రైల్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ – ఫ్యూచర్ సిటీ మార్గం డీపీఆర్లను సైతం సిద్దం చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు ఈ మూడు మెట్రో మార్గాల డీపీఆర్లు సిద్ధం అవుతాయని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.
మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లలో జోరుగా సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఈనెలాఖరుకల్లా ట్రాఫిక్ సర్వే, భూసా మార్థ్య పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు. జేబీఎస్ నుండి మేడ్చల్ వరకు 24 కి.మీ, జేబీఎస్ నుండి శామీర్ పేట్ వరకు 21 కి.మీ మెట్రో కారిడార్లకు డీపీఆర్ల తయారీకై అవసరమైన ట్రాఫిక్ సర్వే, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగుతోంది. ట్రాఫిక్ సర్వేకి సంబంధించిన అధ్యయనంలో ఈ కారిడార్లలో ప్రస్తుతం జరుగుతున్న రోజు వారీ ప్రయాణాల సంఖ్య, భవిష్యత్ లో జరగబోయే రోజు వారీ ప్రయాణాల అంచనాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే మలుపులు, పాదచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం, వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటి అనేక అంశాలు పరిశీలిస్తున్నారు.
ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న థూళికణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష, జంతుజీవాల జీవ వైవిధ్యంపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు నిపుణులు పరిశీలిస్తున్నారు. భూసామర్థ్య పరీక్షల్లో ఈ మార్గాలలో ఉండే వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావాల్సిన భూసామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ సర్వే తరువాత మెట్రో పిల్లర్స్, స్టేషన్లు, ఇతర నిర్మాణాలను ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయించనున్నారు.
ఈ అధ్యయనాలు అన్నీ పూర్తి చేసి మార్చి నెలాఖరు వరకు మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో కారిడార్లతో పాటు, శంషాబాద్ విమానాశ్రయం – ఫ్యూచర్ సిటీ మార్గంతో సహా ఈ మూడు మెట్రో మార్గాల డీపీఆర్లను సంపూర్ణ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి సమర్పించనున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత డీపీఆర్లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి.. అనుమతి రాగానే ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. దీంతో హైదరాబాద్ లోని ఆయా శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యం పెరగనుంది. హైదరాబాద్ లో ఇల్లు కొనలేని మధ్య తరగతి వారు మేడ్చల్, షామీర్ పేట్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో ఇంటి స్థలం లేదంటే ఇళ్లు అందుబాటు ధరల్లో కొనుక్కోవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ఎవరి బడ్జెట్ కు అనుగునంగా వారు స్థిరాస్తులను కొనుగోలు చేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.