Flat for 50 lakhs on Sagar Ring Road
“ఇల్లు, ప్లాట్లు కొనే ముందు ఎవరైనా మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యా సంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇలా అన్ని విధాలుగా అభివృద్ది చెందిన హైదరాబాద్ శివారులోని నాగార్జున సాగర్ రోడ్డు వైపు చూస్తున్నారు. అవును ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న సాగర్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరందుకోవడం, అందరికీ అందుబాటు ధరలో గృహాలు లభిస్తుండటం ఇందుకు కారణాలని చెప్పొచ్చు.”
హైదరాబాద్ శివారులోని నాగార్జున సాగర్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. అందుబాటు ధరలో అపార్ట్ మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, విల్లాలు లభిస్తుండటంతో అంతా సాగర్ రోడ్డు పరిసరాల వైపు చూస్తున్నారు. నగరంలో జీవనం ఆర్థిక భారంగా మారిన మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చులో అన్ని వసతులు ఉన్న కేంద్రంగా సాగర్ రింగ్ రోడ్డు ఆకర్షిస్తోంది. సాగర్ రోడ్డు చుట్టుపక్కల సుమారు చాలా ఏళ్ల క్రితమే ప్రముఖ విద్యా సంస్థలు వెలిశాయి.
సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోనే దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలీపురం, హయత్ నగర్ వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. కూతవేటు దూరంలో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఉండగా, 10 నిమిషాల వ్యవధిలో దిల్ సుఖ్ నగర్ చేరుకోవచ్చు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గచ్చిబౌలి ఫైనాన్సియల్ జిల్లా, పలు ఐటీ కంపెనీలకు ఇక్కడ నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. నాగార్జున సాగర్ కు వెళ్లే రహదారి తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో కనెక్టివిటీ అందరికి అందుబాటులో ఉంది.
నగరానికి సమీపంలో ఆహ్లాదకర వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఇల్లు ఉండాలని కోరుకునేవారు.. సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని ప్రాంతాలు ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. బీఎన్ రెడ్డి నగర్, తుర్కయంజాల్, మన్నెగూడ, బొంగులూరు, శేరిగూడ, ఇబ్రహీంపట్నం వరకు నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నాయి.
ALSO READ: సొంతింటికి ఫార్మూలా ఇదే!
ఒక్కో వెంచరు సుమారు 2 ఎకరాల నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో వినియోగదారులు ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాగర్ హైవే పరిసరాల్లో ఓపెన్ ప్లాట్ వెంచర్లు సైతం భారీగా ఉన్నాయి. ప్రాజెక్టు, ప్రాంతం బట్టి డీటీసీపీ లేఅవుట్ లో చదరపు గజం 20 వేల రూపాయల నుంచి మొదలు 42 వేల రూపాయల వరకు ధరలున్నాయి.
సాగర్ రింగ్ రోడ్డు నుంచి మొదలు ఇబ్రహీంపట్నం వరకు సుమారు 30 నివాస ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. బీఎన్ రెడ్డి నగర్, తుర్కయంజాల్ లో ఎక్కువగా ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్ మెంట్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఎల్బీ నగర్ లో అపార్ట్ మెంట్ లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే సుమారు 80 నుంచి కోటి రూపాయలు కావాల్సిందే. అదే సాగర్ రింగ్ రోడ్డుకు కాస్త దూరంలో ఆల్మాస్ గూడ, ఇంజాపూర్, తుర్కయంజాల్ వంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 50 లక్షల నుంచి 55 లక్షల రూపాయల్లో వస్తోంది.
ఇక బొంగులూరు కు సమీపంలో రూ. 45 లక్షల రూపాయల నుంచి కూడా ఫ్లాట్స్ లభిస్తున్నాయి. అదే ఇండిపెండెంట్ ఇళ్లైతే 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధరలు ఉన్నాయి. నగరంలోని ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు కేవలం 40 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండటంతో మధ్యతరగతి వారు ఎక్కువగా సాగర్ రోడ్డు మార్గంలో ఇల్లు కొంటున్నారు. అటు ఓపెన్ ప్లాట్లు సైతం చదరపు గజం 10 వేల రూపాయల నుంచి దొరుకుతుండటంతో భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నవారు ఇంటి స్థలాన్ని కొంటున్నారు. రానున్న రెండు, మూడేళ్లలో సాగర్ రోడ్డు రూపురేఖలు మరింత మారనున్నాయని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This website uses cookies.