పెట్టుబడి సాధనాల్లో అన్నింటి కంటే ఫ్లాట్ మీదే అత్యధిక రాబడి గిట్టుబాటు అవుతుందనే విషయం మీకు తెలుసా? ఔనా.. అదెలా? అని అనుకుంటున్నారా? మీరు అంగీకరించినా.. అంగీకరించకున్నా.. ఇది ముమ్మాటికి నిజం.
పెట్టుబడుల గురించి ఆలోచిస్తే బంగారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఫిక్సడ్ డిపాజిట్లు వంటి సాధనాలు ఎవరికైనా గుర్తుకొస్తాయి. అయితే, అన్నింటి కంటే ఉత్తమమైనది.. అధిక ఆదాయం తెచ్చేది ఫ్లాట్ మాత్రమే. చాలామంది ఫ్లాట్ కంటే ప్లాటు కొంటే ఉత్తమమని వాదిస్తుంటారు. కానీ, వాస్తవికంగా ఆలోచిస్తే ఫ్లాట్ మీద పెట్టుబడి పెట్టడమే సరైన నిర్ణయం. ఎలాగంటే, ఓ చిన్న సైజు ఫ్లాట్ విలువ రూ.40 లక్షలనుకోండి.. దానిపై ఆరంభంలో మనం పెట్టే పెట్టుబడి ఎనిమిది లక్షలే. అంటే ఇరవై శాతమే. మిగతా 32 లక్షలను బ్యాంకు రుణమిస్తుంది. పైగా, దానిని తీర్చడానికి దాదాపు ఇరవై సంవత్సరాలు తీసుకుంటాం. వడ్డీ శాతం కూడా ఏడు శాతానికి అటుఇటుగా ఉంది.
మన దేశంలో ద్రవ్యోల్బణం సుమారు ఆరు శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. వడ్డీ రేటు ఏడు శాతముంటే, అందులో నుంచి ఆరు శాతాన్ని మినహాయిస్తే.. మొదటి ఏడాది మనం చెల్లించేది కేవలం ఒక శాతమే. మరుసటి ఏడాది కూడా అదే ద్రవ్యోల్బణముంటే.. మనం కట్టే వడ్డీ మైనస్ అవుతుంది. 32 లక్షల రుణంపై నెలకు మహా అయితే 24 వేల వరకూ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే, ఇంటిని అద్దెకు ఇచ్చామనుకోండి.. నెలకు పది వేల వరకూ అద్దె గిట్టుబాటవుతుంది. పైగా ఆదాయ పన్ను రాయితీ ఉంటుంది. ఈ రెండింటినీ లెక్కిస్తే.. మనం జేబులో నుంచి పెట్టేది పెద్దగా ఉండదు. కొన్నాళ్ల తర్వాత ఇంటి రుణం ఇల్లే తీర్చేస్తుంది.