సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే ఇప్పుడు చాలా మంది సొంతింటితో పాటు అదనపు ఆదాయం కోసం మరో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. రెండో ఇంటిని కొని అద్దెకివ్వడం ద్వార అదనపు ఆదాయం పొందవచ్చని చాలామంది ఆలోచిస్తున్నారు. ఆలోచించడమే కాదు హైదరాబాద్ లో వేలాది మంది సొంతిళ్లు ఉండగా, మరో ఇంటిని కొనుగోలు చేసి అద్దెలకిచ్చే ట్రెండ్ బాగా పెరిగిందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఐతే ఇలా బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేసి అద్దెకివ్వడం మంచిదేనా? ఇది ఆర్దికంగా వర్కవుట్ అవుతుందా? ఆర్దిక రంగ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
హైదరాబాద్ నగరంలో ఇప్పుడు చాలా మంది సొంత ఇల్లు ఉన్నవారు.. మరో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఐటీ లాంటి మంచి వేతనం ఉన్న ఉద్యోగం చేస్తున్నవాళ్లు ఈజీగా బ్యాంక్ లోన్ లభిస్తుండటంతో రెండవ ఇంటిని కొనుగోలు చేసి అద్దెలకిస్తున్నారు. ఇళ్లు కొని రెంట్ కు ఇచ్చుకుంటే అదనపు ఆదాయం వస్తుందని చాలా మంది ఈ పని చేస్తున్నారు. అయితే బ్యాంకు లోన్ తీసుకుని మరీ ఇల్లు కొని అద్దెకివ్వడం లాభదాయకమైన పనేనా అన్న సందేహం చాలా మందిలో మెదులుతోంది. ఈ కోణంలో ఇల్లు కొనాలనుకుంటున్నవారు అద్దే ఆదాయంతో పాటు ఈఎంఐ, కొన్న ఇంటి విలువ పెరుగుదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటే ప్రతి నెల ఈఎంఐ లక్ష రూపాయల మేర చెల్లించాల్సి వస్తుంది. కానీ అదే ఇంటిని అద్దెకిస్తే 25 వేల నుంచి 30 వేల రూపాయలు, ఇంకాస్త ప్రీమియం ఏరియా అయితే 35 వేల రూపాయల అద్దె వస్తుందని రియల్ రంగ మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు.
మొత్తంగా ఇంటి కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తం, బ్యాంక్ లోన్ కు కట్టాల్సిన ఈఎంఐ, ఆ తరువాత ఆ ఇంటిని అద్దెకిస్తే వచ్చే నెలవారి ఆదాయాన్ని లెక్కలు వేసుకుంటే ఏ మాత్రం గిట్టుబాటు కాదని చెప్పాలి. ఎందుకంటే ఇంటి కోనుగోలం కోసం కోటి రూపాయలు ఖర్చు చేస్తే ప్రతి నెలా వచ్చే ఆదాయం మాత్రం 25 నుంచి 30 వేల రూపాయలు మాత్రమే. మన దేశంలో ఆస్తుల అద్దె ఆదాయం 3-3.5 శాతం ఉండగా, గృహ రుణంపై వడ్డీ 8.25 నుంచి బ్యాంకును బట్టి 9.5 శాతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక వడ్డీకి ఇల్లు కొంటే ప్రయోజనం ఉండదు. అయితే అన్ని సందర్బాల్లో, అన్ని ప్రాంతాల్లో ఇలా ఒకే కోణంలో ఆలోచించడం సరైంది కాదంటున్నారు రియల్ రంగ నిపుణులు. ఇందుకు కూడా ఓ ఉదాహారణ చెబుతున్నారు. కొనే ఇల్లు విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే స్థిరాస్థి విలువ ఖచ్చితంగా పెరుగుతూ పోతుంది. ప్రాంతాన్ని, ఇంటిని బట్టి ఎంతమేర విలువ పెరుగుతుందన్నది ఆధారపడి ఉంటుంది.
ఇవాళ కోటి రూపాయలు ఉన్న ఇంటి విలువ వచ్చే ఐదేళ్లకు రెండు కోట్లు అవుతుందని అనుకుందాం. కట్టే ఈఎంఐలో సగం కూడా అద్దే రాకపోయినప్పటికీ పెరిగే ఇంటి విలువ దాన్ని కవర్ చేస్తుంది. అంటే కోటి రూపాయల విలువ ఉన్న ఇంటి విలువ ఐదేళ్లలో రెండు కోట్లకు పెరిగితే ప్రతి నెలా ఇంటి అద్దెతో పాటు 1.6 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్టేనని రియల్ రంగ ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అంటే అద్దెతో కలిపితే నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు లెక్కన్నమాట. అందుకే ఇంటిపైన పెట్టుబడికి రెండు రకాల ఆదాయం వస్తుంది. అద్దెతో పాటు ఆ ఇంటి విలువ కూడా నిరంతరంగా పెరుగుతుంది. ఇప్పుడు 25 వేల నుంచి 30 వేలు వచ్చే అద్దె ఐదేళ్లకు 40 నుంచి 50 వేలు కావొచ్చు. ఆస్తి విలువ రెండు కోట్లు అవుతుంది. దీన్ని లెక్కలేసుకుని ఇల్లు కొనుగోలు చేసి అద్దెలకు ఇచ్చుకుంటే మంచి లాభమే వస్తుంది. ఐతే ఇంటి కొనుగోలు చేసే ప్రాంతం, ప్రాజెక్టు, ఇంటి ధరను బట్టి అద్దె, ఇంటి విలువ పెరుగుదల వంటి లెక్కలు బేరీజు వేసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
———————————–