Future City Authority, similar to HMDA
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా Future City Development Authority-FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ-ఎఫ్సీడీఏ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎఫ్సీడీఏ ఛైర్మెన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా.. కమీషనర్ గా ఐఏఎస్ అధికారి శశాంకను నియమించింది. ఫ్యూచర్ సిటీ రూపురేఖలు, నిర్మా ణం ఎలా ఉండాలనే దానిపై సీరియస్ గా కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ-హెచ్ఎండీఏ మాదిరిగానే ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీని అభివృద్ది చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారని తెలిసింది.
ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎఫ్సీడీఏ పరిధిలో.. ప్లానింగ్, ఇంజినీరింగ్ వంటి ప్రధాన విభాగాలను ఏర్పాటు చేస్తారు. హెచ్ఎండీఏ సుమారు 13 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండగా.. ఎఫ్సీడీఏ 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీని అవసరాలకు అనుగుణంగా విస్తరించే విధంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఏర్పాటయ్యే ఫ్యూచర్ సిటీ దశల వారీగా అభివృద్ధి చేసి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ALSO READ: అద్దె రూ.లక్ష.. డిపాజిట్ రూ.8 లక్షలా?
ఫ్యూచర్ సిటీలోని ఎఫ్సీడీఏ పరిధిలోకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 56 రెవెన్యూ గ్రామాలు వస్తున్నాయి. కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్, మహేశ్వరం, మంచాల మండలాలు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. దీంతో ఇటు శ్రీశైలం హైవే, అటు నాగార్జున సాగర్ హైవే వైపు భారీగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫ్యాబ్ సిటీతో పాటు, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్ పరిధిలో కొత్త లే అవుట్లకు, వెంచర్లకు, భారీ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు వివిధ ప్రాంతాలకు లింక్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు.
ఫ్యూచర్ సిటీలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ఇతర నిర్మాణాలకు అనుమతులను అథారిటీనే మంజూరు చేస్తుంది. రానున్న రోజుల్లో ఎఫ్సీడీఏ పరిధిలో హైరైజ్ భవనాల ను నిర్మించే సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఐటీ, మెడికల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ తో పాటు భారీ ఎత్తున మల్టినేషనల్ సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిటీలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
This website uses cookies.