ఆస్తి పన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రికార్డు సాధించింది. ఒక్కరోజే దాదాపు రూ.100 కోట్ల మేర పన్ను వసూలు చేసి చరిత్ర సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులు మార్చి 31న భారీగా జరిగాయి. మార్చి 31లోగా ఆస్తి పన్ను చెల్లించినవారికి బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ ప్రకటిస్తూ జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితమే ఇచ్చింది. చివరి రోజున పన్ను చెల్లింపులు వెల్లువెత్తాయి. అంతేకాకుండా జీహెచ్ఎంసీ చరిత్రలోనే ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు రూ.2వేల కోట్ల మార్కు దాటాయి. పైగా కేవలం ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా రూ.500 కోట్ల పన్ను వసూలు కావడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి ఆస్తి పన్ను రూపేణా సంస్థకు రూ.1500 కోట్లు వచ్చింది. ఒక్క మార్చిలోనే మిగిలిన రూ.400 కోట్లు రాగా, చివరి రోజు రూ.100 కోట్లు వసూలయ్యాయి. వడ్డీ రాయితీ ప్రకటనతోపాటు గత రెండు నెలలుగా దాదాపు 800 మంది సిబ్బంది నగరవ్యాప్తంగా తిరిగి ఆస్తి పన్ను వసూళ్లలో కీలకపాత్ర పోషించినట్టు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (రెవెన్యూ) అనురాగ్ జయంతి తెలిపారు.
This website uses cookies.