నివాస భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో వీటిపై దృష్టి పెట్టింది. ఈ మేరకు నగరంలోని ఆరు జోన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు దాదాపు 1100 భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా ఆయా భవనాలను నివాస కేటగిరీ నుంచి వాణిజ్య కేటగిరీకి మార్చుకోవాలని గడువు విధించారు.
లేని పక్షంలో భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నివాస భవనాల్లో వేలాదిగా వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం కొరవడటంతోనే నివాస భవనాల్లో వాణిజ్యపరమైన కార్యకలాపాలు పెరుగుతున్నాయి. గతేడాది దాదాపు 7 వేలకు పైగా భవనాలను నివాస కేటగిరీ నుంచి వాణిజ్య కేటగిరీకి మార్పు చేశారు. ప్లే స్కూళ్ల నుంచి హాస్టళ్లు, కిరాణా స్టోర్లు, పార్లర్ల వంటి పలు వ్యాపారాలు సాగుతున్న భవనాల పన్నును తప్పుగా లెక్కించడంతో జీహెచ్ఎంసీ భారీగా ఆదాయం కోల్పోతోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
This website uses cookies.