Categories: LEGAL

నిబంధనల ఉల్లంఘన.. బిల్డర్ కు రూ.60 కోట్ల జరిమానా

ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పలు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరించిన బిల్డర్ పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కన్నెర్ర జేసింది. భూగర్భ జలాలను తోడటం దగ్గర నుంచి మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్వహణ వరకు పలు నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.60.23 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు ఎన్జీటీ చైర్ పర్సన్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఘజియాబాద్ మోహన్ నగర్ లో సేవియర్ పార్క్ సొసైటీ పేరుతో సేవ్ ఫ్యాబ్ బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రెసిడెన్షియల్ ప్రాజెక్టు చేపట్టింది. మొత్తం 13 టవర్లలో 850 ఫ్లాట్లు నిర్మించింది. 2015లో వీటిని పూర్తి చేసి అప్పగించింది. అయితే, ప్రాజెక్టులో చాలా నిబంధనలు ఉల్లంఘించారంటూ సొసైటీ అసోసియేషన్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో వాటిని నిగ్గు తేల్చేందుకు వివిధ శాఖలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఏడాది మార్చిలో కమిటీ తన నివేదికను సమర్పించింది.

పర్యావరణ నిబంధనలతోపాటు బిల్డింగ్ బైలాస్ ను కూడా బిల్డర్ ఉల్లంఘించినట్టు అందులో పేర్కొంది. భూగర్భ జలాలను అక్రమంగా తోడుతున్నందుకు రూ.7.43 కోట్లు, మురుగునీటి శుద్ధి వ్యవస్థ ఏర్పాటులో నిబంధనలు పాటించనందుకు రూ.12.80 కోట్లు, అనుమతులు లేకుండా భవనం నిర్మించడం, ఇతరత్రా నిబంధనల ఉల్లంఘనకు రూ.40 కోట్ల జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ.. ఆ మేరకు బిల్డర్ కు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా యూపీ కాలుష్య నియంత్రణ మండలిలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

This website uses cookies.