Categories: TOP STORIES

రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్ల కేటాయింపులో ఉద్యోగుల‌కు ప్రాధాన్య‌త

సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్ల కేటాయింపులో ఉద్యోగుల‌కు ప్రాధాన్య‌త‌నిస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శ‌నివారం ఆయ‌న బండ్ల‌గూడ నాగోలులో ఉన్న రాజీవ్ స్వ‌గృహ ప్రాజెక్టును సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అన్నివ‌ర్గాల వారికి ఫ్లాట్ల కేటాయింపులో ప్రాధాన్య‌త‌నిస్తామ‌ని అన్నారు.

మొద‌ట ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారికే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తామ‌ని చెప్పారు. బండ్లగూడా, పోచారం స్వగృహ ఫ్లాట్ల సముదాయంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామ‌న్నారు. షాపింగ్ కాంప్లెక్స్, ఎస్టీపీ, క్లబ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామ‌ని.. పెండింగ్ సమస్యలపై వెంటనే పనులు ప్రారంభిస్తామ‌ని తెలిపారు. రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్‌ల‌లో పూర్తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. సమస్యల పరిశీలించి ప‌రిష్క‌రించేందుకు స్వ‌యంగా వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చారు.

అనంతరం ఆయ‌న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్పెషల్ సీ.ఎస్ లు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, ఎక్సైజ్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మేడ్చల్ కలెక్టర్ హరీష్, ఇతర ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.

This website uses cookies.