Categories: LATEST UPDATES

ఆఫీస్ స్పేస్ లో గ్లోబల్ దూకుడు

  • దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో 111.6 లక్షల చదరపు అడుగుల లీజింగ్
  • మొత్తం లీజింగ్ లో ఇది 62 శాతం
  • సీబీఆర్ఈ నివేదిక వెల్లడి

దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో గ్లోబల్ కార్పొరేట్లు దూకుడు ప్రదర్శించారు. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో విదేశీ సంస్థలు 111.60 లక్షల చదరపు అడుగుల స్పేస్ ను లీజుకు తీసుకున్నాయి. మార్చి త్రైమాసికంలో మొత్తంగా 180 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదు కాగా, విదేశీ సంస్థల వాటా 62 శాతం కావడం గమనార్హం. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో 171 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. ఇటు దేశీ, అటు అంతర్జాతీయ సంస్థలు వ్యాపారాన్ని విస్తరిస్తుండటంతో లీజింగ్‌ కార్యకలాపాలు మరింతగా పుంజుకునే అవకాశం ఉందని సీబీఆర్‌ఈ చైర్మన్ (ఇండియా, ఆగ్నేయాసియా) అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు.

ఉ‍ద్యోగుల సంక్షేమం, దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టితో కంపెనీలు నాణ్యమైన ఆఫీస్‌ స్పేస్‌లను కోరుకుంటున్నందున, పర్యావరణహిత కార్యాలయాలకు డిమాండ్ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు కూడా ఆఫీస్ స్పేస్‌కు దన్నుగా ఉంటోందని అన్షుమన్ తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన కోసం బహుళజాతి సంస్థలు స్థానికంగా నిపుణుల సేవలను వినియోగించుకోవడంపై ఆసక్తి కనపరుస్తుండటంతో జీసీసీలకు గ్లోబల్ హబ్‌గా భారత్ ఎదుగుతోందని సీబీఆర్‌ఈ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రామ్‌ చంద్నానీ తెలిపారు.

* 2025లో మొత్తం ఆఫీస్ స్పేస్‌లో జీసీసీల వాటా సుమారు 35-40 శాతానికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, వివిధ రాష్ట్రాల్లో సానుకూల విధానాల కారణంగా చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయని వివరించారు. నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని పేర్కొన్నారు. కాగా, జనవరి-మార్చి త్రైమాసికంలో కో-వర్కింగ్ ఆపరేటర్లు.. ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకోవడం 43 శాతం తగ్గింది. తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇది 21.6 లక్షల చదరపు అడుగులకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో కో-వర్కింగ్ ఆపరేటర్లు 37.6 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ను లీజుకు తీసుకున్నారు.

This website uses cookies.