Categories: LATEST UPDATES

భారత్ వైపు గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ల చూపు

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ వైపు అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు దృష్టి సారించాయి. మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. భారత్ లో లగ్జరీ మార్కెట్ 2022 నుంచి 2026 వరకు ఏటా 12 శాతం చొప్పున పెరుగుతూ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని యూరోమానిటర్ తాజా నివేదిక వెల్లడించింది. గూచీ, కార్టియర్, లూయిస్ విట్టన్ వంటి లగ్జరీ బ్రాండ్లు భారతీయ షాపింగ్ మాల్స్ వైపు దృష్టి సారించినట్టు పేర్కొంది. 2026 నాటికి మనదేశంలో 1.4 మిలియన్ల మంది మిలియనీర్లు ఉంటారని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది.

వీరి విలాసవంతమైన జీవనం, హై ఎండ్ రిటైల్ వస్తువుల కొనుగోలు వంటి అంశాలు లగ్జరీ మార్కెట్ ను మరింత ముందుకు తీసుకెళ్తాయని వివరించింది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ముంబైలో కొత్తగా లగ్జరీ షాపింగ్ మాల్ నిర్మించారు. ఇది సంపన్నులకు బాగా ఉపయోగపడనుంది. ఇందులోనే గూచీ, కార్టియర్ వంటి సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించేందుకు లీజుకు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నాయి. అలాగే రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది చివర్లో జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించనుంది. బుర్ బెర్రీ, కీరింగ్, ఎల్వీఎంహెచ్, రిచ్ మోంట్ వంటి లగ్జరీ బ్రాండ్లు జియో వరల్డ్ ప్లాజాలో కనిపించనున్నాయి.

This website uses cookies.