ఇటీవల కాలంలో ప్రీలాంచ్ దగాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు టీఎస్ రెరా కృషి చేస్తున్నప్పటికీ, కొందరు కేటుగాళ్లు ప్రీలాంచుల పేరుతో మస్కా కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు పెట్టుబడిదారుల్లో గందరగోళానికి, భయానికి దారీ తీసే అవకాశం ఉంది. అసలు ప్రీలాంచ్ కింద మోసాలు ఎలా జరుగుతాయి? వాటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలనేది చూద్దామా?
నిజానికి రేట్లు, పరిమాణం, విస్తీర్ణం, మొత్తం భూమి, అంతస్తుల సంఖ్య, ఫ్లోర్ ఏరియా రేషియో, లొకేషన్ వంటి కనీస వివరాలు ఏవీ సరిగా చెప్పకుండానే నాన్ బ్యాంకబుల్ చెక్కులు ఇవ్వాలని బిల్డర్లు కోరడం దారుణమైన అంశం. ఇలాంటి అంశాల్లో పారదర్శకత లేకుంటే ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. కొంతమంది డెవలపర్లు ముందుగా చెక్కులు ఇచ్చేవారికే ప్రాధాన్యత ఇచ్చి ప్లాట్లు కేటాయిస్తారు. తద్వారా పెట్టుబడిదారుల్లో తాము చెక్కులు ఇవ్వకుంటే ఆ ప్లాట్ మిస్సయిపోతామేమో అనే భయాన్ని అంతర్లీనంగా సృష్టిస్తారు. మీ పెట్టుబడిపై అత్యధిక రాబడి వస్తుందంటూ హామీల మీద హామీలు గుప్పిస్తుంటారు. మరికొందరు డెవలపర్లు అసలు రెరా ఆమోదం పొందని ప్రాజెక్టులను కూడా మార్కెటింగ్ చేసేస్తున్నారు. ఇలాంటి చర్యలు రెరా నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పెట్టుబడిదారులకు నష్టం చేసే అవకాశం ఉంది. ఇలాంటివాటికి చెక్ చెప్పి, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకే రెరాను ఏర్పాటు చేశారు.
భద్రత: కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల డబ్బులో కనీసం 70 శాతం మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో ఉంచాలని రెరా ఆదేశిస్తుంది. ఈ డబ్బును నిర్మాణం, భూమి కొనుగోలు ఖర్చులకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేస్తుంది. ఈ నిధులు ఎక్కడికీ దారి మళ్లించకూడదని నిర్దేశిస్తుంది.
పారదర్శకత: బిల్డర్లు ఒరిజినల్ ప్రాజెక్టు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్టు ప్లాన్ లో ఏవైనా మార్పులు చేస్తే.. ఆ మేరకు అనుమతి తీసుకోవాలి. అలాగే బిల్డర్లు సూపర్ బిల్టప్ ఏరియా కాకుండా కార్పెట్ ఏరియాను బట్టి విక్రయాలు చేయాలి. ఒకవేళ ప్రాజెక్టు ఆలస్యమైతే కొనుగోలుదారులు పూర్తి రిఫండ్ కు అర్హులు. లేదా తమ పెట్టుబడి కొనసాగిస్తూ.. నెలకు ఇంత మొత్తం జరిమానా రూపంలో పొందవచ్చు.
నాణ్యత హామీ: ప్రాపర్టీ కొనుగోలు చేసిన ఐదేళ్ల లోపు కొనుగోలుదారులు ఎదుర్కొనే సమస్యలను బిల్డరే పరిష్కరించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా వాటిని సరిచేయాలి.
తప్పనిసరి నమోదు: డెవలపర్లు తమ ప్రాజెక్టును రెరా నమోదు చేయకుండా ప్రచారం చేయకూడదు. విక్రయించకూడదు.. అసలు నిర్మించకూడదు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలపై రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రదర్శించాలి.
ఒకవేళ బిల్డర్లు రెరా నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా చేస్తే. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి రెరాకు అధికారం ఉంది. ప్రాజెక్టును రెరాలో నమోదు చేయకుంటే, ఆ ప్రాజెక్టు అంచనా వ్యయంలో 10 శాతం వరకు జరిమానా కట్టాల్సి రావొచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా రెరాలో నమోదు కాని ప్రాజెక్టులకు సంబంధించిన లావాదేవీల్లో పాల్గొనకుండా రెరా నిషేధం విధించింది. నిజానికి ఎన్ని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రీలాంచ్ మోసాలకు చెక్ పడటంలేదు. ఈ నేపథ్యంలో రెరా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో పెట్టుబడిదారులు సైతం జాగరూకతతో ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు సమగ్రంగా అన్ని వివరాలూ పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. పెట్టుబడులలన్నీ రెరా చట్టం నిబంధనలకు మేరకు ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు.
This website uses cookies.