-
ఎన్నికల వేళ.. ఏమిటీ అరాచకం?
తెలంగాణ శాసనమండలి సభ్యులు చల్లా వెంకట్రామిరెడ్డితో పాటు ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డిల వేధింపులకు గురవుతున్నామని గోల్డ్ ఫిష్ అధినేత చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు తమపై తప్పుడు కేసుల్ని బనాయిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టడమే కాకుండా చివరకు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారని చెప్పారు. గురువారం తాజ్ దక్కన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అబోడ్ ఫిష్ ఎండీ చంద్రశేఖర్ వేగె మాట్లాడుతూ.. చల్లా వెంకట్రామిరెడ్డి చేసిన ఆరోపణలకు పూర్తి స్థాయి వివరణ ఇచ్చారు. చల్లా వెంకట్రామిరెడ్డి చేసిన పలు ఆరోపణలకు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడమే కాకుండా సంబంధిత డాక్యుమెంట్లను ప్రజాబాహుళ్యంలో ఉంచారు. తప్పుడు సమాచారాం మరియు అర్థసత్యాలతో ఎలా కంపెనీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారో వివరించారు. నిజాన్ని ఎదుర్కోలేక చల్లా వెంకట్రామి రెడ్డి తమను మోసగాళ్లగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చల్లా వెంకట్రామి రెడ్డి ఎత్తులకు తాము భయపడేది లేదని.. వాటిని చట్టబద్దంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తమపై వీరు చేస్తున్న అరాచకాలకు తలొగ్గమని న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని, తగిన న్యాయం దక్కుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.