కాస్మోపాలిటిన్ సిటీ గ్రేటర్ హైదరాబాద్ నాలుగు ముక్కలు కానున్నది. పరిపాలనా సౌలభ్యం కోసం భాగ్యనగరాన్ని నాలుగు భాగాలుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ను మొత్తం నాలుగు కార్పోరేషన్లు గా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఔటరి రింగ్ రోడ్డులోని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పోరేషన్లన్నింటిని విలీనం చేసి.. కొత్తగా నాలుగు కార్పోరేషన్లను ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరం అంతకంతకు విస్తరిస్తోంది. తెలంగాణలోని గ్రామాలు, పల్లే వాసులంతా వివిధ అవసరాల నిమిత్తం గ్రేటర్ సిటీలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి ఉపాధి అవకాశాలతో పాటు విద్యా, వైద్యం కోసం చాలా మంది భాగ్యనగరానికి విచ్చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర జనాభా అంతకంతకు పెరిగిపోతోంది. ప్రస్తుతం లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా కోటి అని చెబుతున్నా సుమారు కోటి 40 లక్షల జనాభా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో అంటే 2028 నాటికి హైదరాబాద్ జనాభా రెండు కోట్లు దాటుతుందని అంచనా చేస్తున్నారు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
పెరుగుతున్న హైదరాబాద్ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు, సౌకర్యాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం హైదరాబాద్ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లు కాగా మెజార్టీ విస్తీర్ణం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కింద ఉంది. దీంతో పరిపాలన కొంత మేర కష్టతరమవుతుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ను నాలుగు కార్పోరేషన్లుగా విభజించాలని తెలంగాణ సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మునిసిపాలటీలను, కార్పోరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసి.. మొత్తం నాలుగు మునిసిపల్ కార్పోరేషన్లను ఏర్పాటు చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఔటరి రింగ్ రోడ్డు లోపల ఉన్న మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పోరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం సుమారు 800 చదరపు కిలోమీటర్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీని నాలుగు కార్పోరేన్లుగా విభజిస్తే ఒక్కో కార్పోరేషన్ కిందకు 200 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం వస్తుందని చెబుతున్నారు. అప్పడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
జీహెచ్ఎంసీని నాలుగు కార్పోరేషన్లుగా విభజించడం ద్వారా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్తు సరఫరా, రోడ్ల నిర్వహణతో పాటు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీని నాలుగు కార్పోరేషన్లుగా విభజించే అంశంపై ఇప్పటికే రేవంత్ సర్కార్ కసర్తతు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ప్రకటన చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ను నాలుగు కార్పోరేషన్లుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రియల్ రంగ నిుణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజించడం ద్వార మౌలిక వసతులు చాలా వేగంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్న అభివృద్ది నలువైపులా విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు సామాన్య, మధ్యతరగతి వారికి సైతం అందుబాటు ధరల్లో ఇంటి స్థలం, ఇల్లు లభిస్తాయని రియల్టీ రంగ నిపుణులు అంటున్నారు. గ్రేటర్ సిటీ విస్తరించడం ద్వారా మరింత స్థలం అందుబాటులోకి వస్తే ఇంటి నిర్మాణ వ్యయం తగ్గి.. ఇళ్ల ధరలు సైతం అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.
This website uses cookies.