Categories: TOP STORIES

అక్టోబ‌రు 20 నుంచి 22 వ‌ర‌కూ న‌గ‌రంలో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌

  • ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సి.శేఖర్ రెడ్డి

గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 20వ ఎడిషన్‌ను అక్టోబర్ 20 నుండి 22 వరకు హెచ్ఐసీసీలో నిర్వ‌హిస్తున్నామ‌ని ఐజీబీసీ చైర్మన్ సి.శేఖర్ రెడ్డి వెల్ల‌డించారు. న‌గ‌రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. హ‌రిత ఉద్య‌మంలో చేరేందుకు అనేక మందిని ప్రోత్స‌హించ‌డంతో పాటు 2070 నాటికి భారతదేశంలో నికర జీరో ఉద్గారాలను సాధించేందుకు రోడ్డు మ్యాపును త‌యారు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని తెలిపారు. మూడు రోజుల స‌ద‌స్సులో ఎన‌భై మందికి పైగా ప్రముఖ వక్తలు హాజరవుతున్నారని చెప్పారు. హరిత భవనాల‌కు సంబంధించిన అనేక కీల‌క‌మైన విష‌యాల్ని ఈ కార్య‌క్ర‌మంలో క‌వ‌ర్ చేస్తున్నార‌ని తెలిపారు. 20 మందికి పైగా అంతర్జాతీయ వక్తలు తమ అనుభవాలను పంచుకుంటారని. హరిత భ‌వ‌నాల నిర్మాణాల్లో ఉత్త‌మ ప్ర‌మాణాల గురించి అవ‌గాహ‌న పెంచుకునేందుకు ఈ స‌ద‌స్సు చ‌క్క‌గా ప‌నికొస్తుంద‌ని వివ‌రించారు.

హ‌రిత భ‌వ‌నాల గురించి ఆలోచించే వ్య‌క్తులు, కంపెనీలు క‌లిసి చ‌ర్చించేందుకు ఈ వేదిక ప‌నికొస్తుంద‌ని సి.శేఖ‌ర్ రెడ్డి అన్నారు. ఇందులో సుమారు 3,000 మంది ప్రతినిధులను మరియు ఎక్స్‌పోకు 10,000 మంది సందర్శకులు విచ్చేసే అవ‌కాశ‌ముంది. ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్లు, డెవలపర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ప్లానర్లు, కన్సల్టెంట్లు, కార్పొరేట్, ప్రభుత్వ అధికారులు, గ్రీన్ ప్రొడక్ట్ తయారీదారులు, ప్రొక్యూర్‌మెంట్ అధికారులు, ప్రాజెక్ట్ ఓనర్‌లు, ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, టెక్నాలజీ ప్రొవైడర్లు త‌దిత‌రులు ఈ మూడు రోజుల కార్య‌క్ర‌మంలో పాలుపంచుకుంటార‌ని వివ‌రించారు. ఈ మూడు రోజుల స‌ద‌స్సులో గ్రీన్ హోమ్స్, గ్రీన్ ప్రొడక్ట్స్ మరియు మెటీరియల్స్‌పై ప్రత్యేక సెషన్‌లను నిర్వ‌హిస్తామ‌ని.. దీంతో పాటు గ్రీన్ ఎక్స్‌పో గ్రీన్ ప్రొడక్ట్స్, మెటీరియల్స్ మరియు లేటెస్ట్ టెక్నాలజీలను ప్రదర్శిస్తామ‌ని తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022లో భాగంగా హరిత ఉద్యమంలో విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి అవార్డుల‌ను అందజేస్తామ‌న్నారు. హ‌రిత నిర్మాణాల ప్రాముఖ్య‌త‌పై చిన్నారుల‌కు అవగాహన కల్పించడానికి గత 15 సంవత్సరాలుగా గ్రీన్ యువర్ స్కూల్ ప్రోగ్రామ్ మరియు గ్రీన్ డిజైన్ పోటీలను నిర్వహిస్తున్నామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐజీబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెఎస్ వెంకటగిరి, ఐజీబీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. ఆనంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

This website uses cookies.