Categories: TOP STORIES

హైదరాబాద్ లో మారుతున్న భవనాల డిజైన్

అందంగా ఆకాశహర్మ్యాల రూపురేఖలు

ఆకట్టుకునే ఎలివేషన్లతో ఐకానిక్‌ టవర్ల నిర్మాణం

సరికొత్త డిజైన్లతో నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు

హైదరాబాద్ నిర్మాణరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. భారీ నిర్మాణాలకు సంబంధించి డిజైన్, ఎలివేషన్ కు ప్రస్తుతం అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి నిర్మాణరంగ సంస్థలు. అంతర్జాతీయ అర్కిటెక్చరల్ డిజైన్లతో స్కై స్క్రాపర్స్ డిజైన్లు అబ్బురపరుస్తున్నాయి.

హైదరాబాద్ నిర్మాణరంగంలో ఆకాశహర్మ్యాల విషయంలో స్పష్టమైన మార్పు కనబడుతోంది. ఇప్పుడిప్పుడే కొన్ని నిర్మాణ సంస్థలు ఆ ప్రాంతానికి, నగరానికి అందం తీసుకొచ్చేలా నిర్మాణాలు చేపడుతున్నాయి. చూపరుల చూపు తిప్పుకోనివ్వని ఎలివేషన్లతో నిర్మాణ ప్రాజెక్టులను మొదలుపెట్టాయి. మూడు నాలుగేళ్లలో ఈ సరికొత్త డిజైనింగ్ భవనాల రూపురేఖలను నగరవాసులు చూడబోతున్నారు. ఐటీ కారిడార్‌లోని హైటెక్ సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట, కొండాపూర్‌, మణికొండ, నార్సింగి, మంచిరేవుల, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, నల్లగండ్ల ప్రాంతాలను కొత్తగా చూసిన వారికి భారీ నిర్మాణాలు ఔరా అనిపిస్తున్నాయి. 30 నుంచి 40 అంతస్తుల్లోని ఐటీ కార్యాలయాల భవనాలు.. ఆ పక్కనే నివాస ఆకాశహర్మ్యాలు చూస్తుంటే ఎక్కడో విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. అయితే అన్ని భవనాలు డబ్బాల మాదిరి కడుతున్నారే అనే అసంతృప్తి మొన్నటి వరకు వ్యక్తం కాగా.. ఇప్పుడు బిల్డర్లు, నిర్మాణ సంస్థల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇళ్ల విక్రయాలను ప్రధానంగా ధర, వాస్తు ప్రభావితం చేస్తాయి. రెండు పడక గదులు మొదలు ఐదు పడక గదుల వరకు ఏది కట్టినా ప్రతి గది వాస్తు ప్రకారం ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటారు. వాస్తులేని ఫ్లాట్లను విక్రయించడానికి డెవలపర్లు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలివేషన్ డిజైన్ తో భవనాన్ని నిర్మిస్తే కొన్ని ఫ్లాట్స్ వాస్తు ప్రకారం కట్టలేమని బిల్డర్లు చెబుతున్నారు. అందుకే ఎక్కువ మంది బిల్డర్లు భిన్నమైన ఎలివేషన్ల వైపు వెళ్లడం లేదు. దీనికి తోడు స్కై స్క్రాపర్స్ కు ఎలివేషన్, ప్రత్యేక డిజైన్ కోసం అంతర్జాతీయస్థాయి డిజైనర్స్, కన్సల్టెంట్లను ఎంగేజ్ చేసుకోవాల్సి రావడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం కూడా ఇందుకు ఓ కారణమని చెబుతున్నారు.

స్థానిక బిల్డర్లతో పాటూ ఇతర నగరాల నుంచి వచ్చిన బిల్డర్లు ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌లో అబ్బురపరిచే ఎలివేషన్లతో ఆకాశహర్మ్యాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభం కాగా, మరికొన్ని ప్రణాళిక దశలోనే ఉన్నాయి. హైటెక్‌ సిటీ, పొప్పాలగూడ, నార్సింగి, రాయదుర్గంలో ఎక్కువగా ఇలాంటి ఎలివేషన్ డిజైన్ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా స్కై విల్లాలు, విల్లామెంట్‌లను కడుతున్నారు. స్కై డెక్‌ల వంటి వినూత్న డిజైన్లతో ఇంటి కొనుగోలుదారుల ముందుకు వస్తున్నారు బిల్డర్లు. ఇంటి లోపల డిజైన్లతో పాటు బయటి రూపురేఖలు కూడా ముఖ్యమేనని నిర్మాణరంగ సంస్థలు గ్రహించడంతో ఇక ముందు ఇలాంటి ప్రాజెక్టులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కేవలం ఎలివేషన్, భవనాల డిజైన్లే కాకుండా పై అంతస్తుల్లో స్విమ్మింగ్ పూల్స్, టెర్రస్ గార్డెన్ వంటి అత్యాధునిక, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ పద్ధతులతో నిర్మాణాలు చేపడుతున్నారు బిల్డర్లు.

This website uses cookies.