Categories: TOP STORIES

చౌటుప్పల్ పరిసరాల్లో భారీగా రియల్ వెంచర్లు

అంతర్జాతీయస్థాయిలో అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరానికి రీజినల్ రింగ్ రోడ్డు మరో మణిహారంగా మారనున్న‌ది. తెలంగాణ అభివృద్ధిలో ట్రిపుల్ ఆర్ గేమ్ ఛేంజర్ కానుందని రియల్ ఎస్టేట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం 347 కిలో మీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేను రెండు భాగాలుగా నిర్మించనున్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సంబంధించిన‌ భూసేకరణ పనులు మొదలవ్వగా, టెండర్లు ఆహ్వానించేందుకు సిద్దమవుతోంది తెలంగాణ ప్రభుత్వం.

హైదరాబాద్ నగరం చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు ఉండగా.. దీని వెలుపల రీజినల్ రింగ్ రోడ్‌‌ నిర్మాణం జరగనుంది. ఔటర్ రింగ్ రోడ్‌కు వెలుపల 347 కిలో మీటర్ల మేర తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు అవుతోంది. రీజినల్ రింగ్ రోడ్‌ సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందనీ, ఈ ప్రాజెక్ట్ వస్తే రాష్ట్ర స్వరూపం మారిపోతుందనీ తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా చౌటుప్పల్ దగ్గర నిర్మించే భారీ జంక్షన్ తో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రతిష్టాత్మకమైన రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మొత్తం 12 ఇంటర్ చేంజర్స్ నిర్మించేలా డిజైన్ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ అయ్యే ఈ 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్స్ ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరుపుకోబోయే ఈ భారీ ఇంటర్ చేంజర్స్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్స్ లో విజయవాడ జాతీయ రహదారిపై మందాపురం..పెనుమటివానిపురం మధ్య వచ్చే జంక్షన్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.

నేషనల్ హైవే 65ను కనెక్ట్ చేస్తూ చౌటుప్పల్ దగ్గర నిర్మించబోయే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇటు హయత్ నగర్ నుంచి పెద్ద అంబర్ పేట్ వరకు డెవలప్ అవ్వగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, చౌటుప్పల్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని అంచనా వేస్తున్నారు.

This website uses cookies.