భారతదేశంలో వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల ఘన వ్యర్థాల ఉత్పత్తిలో ప్రమాదకరమైన పెరుగుదలకు దారి తీసింది. ఫలితంగా పర్యావరణ, ఆరోగ్యపరమైన సమస్యలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం భారతదేశంలో సగటు తలసరి ఘన వ్యర్థాల ఉత్పత్తి ప్రతి వ్యక్తికి.. రోజుకు 0.2 కిలోల నుంచి 0.6 కిలోల వరకు ఉంది. ఇందులో పొడి వ్యర్థాలు 40% నుంచి 50% వరకు ఉన్నాయి. నగరాలు విస్తరిస్తున్నప్పుడు, జీవనశైలి మారుతున్నప్పుడు ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల పరిమాణం జనాభా పెరుగుదల కంటే రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతోంది. అసలే ఇప్పటికే క్లిష్టంగా ఉన్న సమస్యను ఇది మరింత తీవ్రతరం చేస్తోంది.
ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల ప్రమాదకర పెరుగుదల మానవజాతి ముందున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి. పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి చాలా ఆందోళనకరమైన అంశం. 2016 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (పీడబ్ల్యూఎం) నిబంధనల అమలు, 2022లో చేసిన సవరణలతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలపై (యూఎల్ బీలు) ఉంచడం ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినప్పటికీ, అనేక యూఎల్ బీలు సేకరించిన పొడి వ్యర్థాలను సమర్ధవంతంగా ట్రాక్ చేయడానికి, నిర్వహించడానికి అష్టకష్టాలు పడుతున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో ఉన్న అంతరం ఈ సమస్యను మరింత క్లిష్టంగా చేస్తోంది. యూఎల్ బీలు, రీసైక్లర్ల మధ్య మధ్య ప్రభావవంతమైన ఛానెల్‌లైజేషన్ లేకపోవడం, రీసైక్లింగ్ ప్రక్రియల ధృవీకరణతో అసమగ్రంగా ఉండటం వంటి అంశాలు ప్లాస్టిక్ వ్యర్థాలను పునరుద్ధరణ, పునర్వినియోగానికి సరిగా వీలు పడటంలేదు. ఇది వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాల ప్రభావాన్ని బలహీనపరచడమే కాకుండా పర్యావరణ కాలుష్యం, ఆరోగ్యపరమైన ముప్పులను ఎక్కువ చేస్తోంది.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి, ఇప్పటికే ఉన్న అంతరాలను తగ్గించడానికి ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లను స్థాపించడం ఓ చక్కని మార్గం. ఇవి యూఎల్ బీలు, రీసైక్లర్ల మధ్య కీలకమైన లింక్‌గా పని చేస్తాయి. ఒక అధికారిక, వ్యవస్థీకృత వ్యవస్థను సృష్టించడం ద్వారా ఈ ప్లాంట్లు ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్ధవంతంగా ప్రాసెస్ చేయడం, రీసైకిల్ చేయడం, పర్యావరణ అనుకూల పద్ధతిలో పునర్వినియోగం అయ్యేలా చూస్తాయి. ఈ విధానం సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే కాకుండా వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
ఈ మోడల్ ఉపాధి కల్పనతోపాటు వనరుల సామర్థ్యం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తూనే ప్లాస్టిక్ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలో స్వయం సహాయక సంఘాలను ఏకీకృతం చేయడం ఈ ప్రయత్నాలను మరింత మెరుగుపరుస్తుంది. కమ్యూనిటీ స్థాయిలో వ్యర్థాలను నిర్వహించడంలో ఎస్‌హెచ్‌జీలు కీలకమైనవి. ఇవి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి:
i) ఎస్ హెచ్ జీలు వ్యర్థాల విభజన, సేకరణ, రీసైక్లింగ్ వంటి కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. తద్వారా సభ్యులకు స్థిరమైన ఆదాయ వనరులను అందించవచ్చు.
ii) స్థానిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా స్వయం సహాయక సంఘాలు వ్యర్థాల నిర్వహణ పట్ల సమాజ అవగాహన మరియు బాధ్యతను పెంచుతాయి.
iii) స్వయం సహాయక సంఘాలను నిమగ్నం చేయడం వల్ల వ్యర్థాలు సక్రమంగా పారవేస్తున్నారో లేదో నిర్ధారణ అవుతుంది. తద్వారా కాలుష్య ప్రమాదాన్ని తగ్గడంతోపాటు స్థానిక పరిసరాలు మెరుగవుతాయి.
భారతదేశ వ్యర్థ పదార్థాల నిర్వహణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఈ విషయంలో ముందుకు సాగడానికి బహుముఖ విధానం అవసరం. వ్యర్థాల సేకరణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, వ్యర్థాల మూలస్థానంలోనే విభజనను ప్రోత్సహించడం వంటి అంశాలు రీసైక్లింగ్ రేట్లను గణనీయంగా మెరుగుపరుస్తుంది. యూఎల్ బీలు, రీసైక్లింగ్ సంస్థల మధ్య దృఢమైన సహకారాన్ని ఏర్పాటు చేయడం వల్ల వ్యర్థాల ట్రాకింగ్, నిర్వహణను సులభతరం చేయవచ్చు. అలాగే వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాల్లో కమ్యూనిటీలు పాల్గొనడం చాలా ముఖ్యం.
పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించే పద్ధతులకు విస్తృత మద్దతు ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుంది. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనిచ్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం మరింత స్థిరమైన వనరుల నిర్వహణ, వ్యర్థాల తగ్గింపుకు దారి తీస్తుంది. చివరగా.. భారతదేశం తన వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడంలో కీలకమైన దశలో ఉందని గమనించడం ముఖ్యం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో అంతరాలను పూడ్చడం ద్వారా, స్వయం-సహాయక బృందాలకు సాధికారత కల్పించడం ద్వారా మనం మరింత స్థిరమైన, వ్యర్ధ స్పృహతో కూడిన భవిష్యత్తుకు మార్గం సుగమం చేయవచ్చు.
This website uses cookies.