లే అవుట్ల కమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో అప్లికేషన్లను పరిశీలించి ఆమోదించాలని నిర్ణయించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ను వినియోగించనున్నారు.
రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగులో ఉన్న లేఅవుట్ల కమబద్ధీకరణ అంశానికి కదలిక వచ్చింది. తాజాగా రేవంత్ సర్కార్ ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. కొన్ని నిబంధనలను సైతం సడలించింది. పెండింగ్ దరఖాస్తులను ఆమోదించడానికి అనుమతులు ఇచ్చింది. 2020లో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను సైతం ఆహ్వానించారు. ఒక్కో అప్లికేషన్ కు రూ.1000 చొప్పున వసూలు చేసింది ప్రభుత్వం. దీంతో ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కానీ.. కోర్టు కేసులు రావడంతో ఆ ప్రక్రియ అప్పుడు ఆగిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పై అనేక సార్లు కీలక ప్రకటనలు చేసింది. దరఖాస్తుదారులకు మేలు జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు తాజాగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతించింది. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. దరఖాస్తులను మొత్తం మూడు దశల్లో వడపోసి ఆమోదించనున్నారు. సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ద్వారా ఈ ప్రాసెస్ నిర్వహించనున్నారు.
మొదటి దశ
ప్రత్యేకంగా రూపొందించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్లికేషన్ ఆధారంగా మొదటిదశలో అప్లికేషన్లను పరిశీలిస్తారు. ప్రభుత్వ భూముల్లో చేసిన లే అవుట్లు, వివాదాస్పద భూముల్లో చేసిన లే అవుట్లకు సంబంధించిన పర్మిషన్లను ఈ దశలోనే ఆపేస్తారు. ధరణి పోర్టర్లో ఉన్న వివరాలు, సర్వే నంబర్ల ఆధారంగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలను ఇందుకోసం పరిశీలిస్తారు. లేఅవుట్ వేసిన భూమి సమగ్ర వివరాలను గుర్తించి.. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, పంచాయతీ ఈవో తదితర అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. ఈ బృందం ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించినదా? కోర్టు వివాదాలు ఉన్నాయా? అన్న వివరాలను పరిశీలిస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ లో ఈ వివరాలను నమోదు చేస్తారు.
రెండోదశలో..
ఫస్ట్ ఫేజ్ లో క్లీయర్ అయిన అప్లికేషన్లను ఈ దశలో పరిశీలిస్తారు. టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు ఈ అప్లికేషన్లను పరిశీలిస్తారు. లేఅవుట్ వివరాలు, నిబంధనల ప్రకారం ఖాళీ స్థలం వదిలేశారా? రోడ్లను నిర్మించారా? తదితర టెక్నికల్ అంశాలను ఈ ఫేజ్ లో పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉన్నాయని భావిస్తే.. ఆ దరఖాస్తుకు క్రమబద్ధీకరణ ఫీజును డిసైడ్ చేస్తారు. దరఖాస్తుదారులు ఫీజు చెల్లించిన మూడో ఫేజ్ కు అప్లికేషన్ ను ఫార్వర్డ్ చేస్తారు.
మూడోదశలో..
ఇది ఫైనల్ దశ. మొదటి రెండు దశలను దాటి వచ్చిన అప్లికేషన్లను ఈ ఫేజ్ లో పరిశీలిస్తారు. మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఈ దశలో అప్లికేషన్లను పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. లోపాలు ఉంటే రిజెక్ట్ చేస్తారు. లేకుంటే అనుమతి కోసం సంబంధిత అధికారులకు పంపిస్తారు.
మూడు నెలల్లో..
ఈ నెల ఫస్ట్ వీక్ లోనే ఎల్ఆర్ఎస్ ప్రాసెస్ ను ప్రారంభించి మూడు నెలల్లో క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, పంచాయతీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించింది.
This website uses cookies.