Categories: TOP STORIES

ల్యాండ్ యూజ్ కోస‌మేనా?

ఎన్నిక‌ల కోస‌మే ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేశార‌ని సామాన్యులకు సైతం అర్థ‌మైంది. ఆ 84 గ్రామాల్లో ట్రిపుల్ వ‌న్ జీవో నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. కాక‌పోతే, ఇంత‌వ‌ర‌కూ మాస్ట‌ర్ ప్లాన్ త‌యారీకి సంబంధించిన ఒక్క ప్ర‌క‌ట‌న కూడా ప్ర‌భుత్వం వెల్ల‌డించలేదు. ఎక్క‌డెక్క‌డ నివాస, వాణిజ్య భ‌వ‌నాల‌కు అనుమ‌తినిస్తారు? మ‌ల్టీయూజ్ జోన్ ఎక్క‌డొస్తుంది? ఐటీ జోన్‌, క‌న్జ‌ర్వేష‌న్ జోన్ వంటివి ఎక్క‌డొస్తాయి? మాస్ట‌ర్ ప్లాన్ రోడ్లు వ‌చ్చేదెక్క‌డ‌? త‌దిత‌ర అంశాల్లో ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వెలువ‌డాల్సి ఉంది. కాక‌పోతే, న‌గ‌ర రియ‌ల్ రంగంలో ట్రిపుల్ వ‌న్ జీవోకు సంబంధించి సరికొత్త అంశం తెర‌మీదికొచ్చింది.

ఇప్ప‌టికే భూములు కొన్న‌వారికి చేంజాఫ్ ల్యాండ్ యూజ్ చేయ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌నే స‌మాచారం జోరుగా వినిపిస్తోంది. మార్కెట్ విలువ ప్ర‌కారం కొంత‌ శాతం సొమ్ము చెల్లిస్తే.. చేంజాఫ్ ల్యాండ్ యూజ్ చేస్తార‌నే వార్త రియ‌ల్ రంగంలో గుప్పుమంటోంది. మాస్ట‌ర్ ప్లాన్ ఖ‌రారు అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి.. ఈలోపు ఎవ‌రైనా ల్యాండ్ క‌న్వ‌ర్ష‌న్ కావాలంటే చేసుకోవ‌చ్చ‌ట‌. ప్ర‌భుత్వానికి స‌న్నిహితంగా ఉండే వ్య‌క్తుల‌కే ఈ విష‌యం తెలుస‌ని.. బ‌య‌టికి వారికి తెలియ‌ద‌ని స‌మాచారం. మ‌రి, ఇందులో వాస్త‌వ‌మెంత ఉందో తెలియ‌దు కానీ.. న‌గ‌ర రియ‌ల్ రంగంలో చేంజాఫ్ ల్యాండ్ యూజ్ గురించి చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. కాబ‌ట్టి, ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మాస్ట‌ర్ ప్లాన్ గురించి ఇప్ప‌టికైనా స్ప‌ష్ట‌మైన విధివిధానాల్ని తెలియ‌జేయాలి.

This website uses cookies.